భారత జట్టు మహా సమరానికి సిద్ధమైంది. వన్డే వరల్డ్ కప్‌ను తృటిలో చేజార్చుకున్న టీమిండియా టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా వేట మొదలుపెట్టనుంది. గ్రూప్-ఏలో భాగంగా ఇవాళ న్యూయార్క్ వేదికగా నాసా కంట్రీ స్టేడియంలో ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతోంది.
అయితే ఈ టీ20 వరల్డ్ కప్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ఎంతో ప్రత్యేకమైనది. భారత జట్టు కోచ్‌గా ద్రవిడ్‌కు ఇదే ఆఖరి మిషన్. మరోవైపు 37 ఏళ్ల రోహిత్‌కు తన కెరీర్‌లో ఇదే ఆఖరి టీ20 కప్ అయ్యే అవకాశాలే ఎక్కువ. ఈ నేపథ్యంలో టైటిల్‌తో ఘనంగా ఫేర్‌వెల్ దక్కించుకోవాలని ఇద్దరూ భావిస్తున్నారు.

మునుపెన్నడూ లేని విధంగా పొట్టి కప్‌లో ఇరవై దేశాలు బరిలోకి దిగుతున్నాయి. నాలుగు గ్రూప్‌లుగా విడిపోయి సూపర్-8 బెర్త్ కోసం పోటీపడుతున్నాయి. ఈ మెగాటోర్నీకి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. సూపర్-8 నుంచి టోర్నీ మొత్తం సాగేది కరేబియన్ దీవుల్లోనే. అయితే వెస్టిండీస్ ఆతిథ్యం అంటే భారత అభిమానులను ఓ చేదు జ్ఞాపకం ఎప్పుడూ వెంటాడుతుంటోంది. అదే 2007 వన్డే వరల్డ్ కప్.
2007 వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఫేవరేట్‌గా బరిలోకి దిగింది. అప్పటి టీమిండియాలో ఆటగాళ్లందరూ దిగ్గజాలే. రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, అజిత్ అగార్కర్, జహీర్ ఖాన్‌తో పాటు యువ ప్లేయర్లు ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, దినేశ్ కార్తీక్, ఉతప్ప, శ్రీశాంత్, మునాఫ్ పటేల్‌తో జట్టు ఎంతో బలోపేతంగా ఉంది. కానీ కట్ చేస్తే గ్రూప్ స్టేజ్‌లోనే టీమిండియా నిష్క్రమించింది. బంగ్లాదేశ్, శ్రీలంక చేతుల్లో ఓటమిపాలైంది.
ఈ పేలవ ప్రదర్శనతో రాహుల్ ద్రవిడ్ తన కెప్టెన్సీని వదులుకున్నాడు. అయితే 17 ఏళ్ల తర్వాత వెస్టిండీస్ గడ్డపై ఎదురైన చేదు జ్ఞాపకాలను కోచ్‌గా చెరిపేసుకునే అవకాశం ద్రవిడ్‌కు వచ్చింది. గత పొరపాట్లను పునరావృతం చేయకుండా టైటిల్ సాధించి కోచ్ పదవిని ద్రవిడ్ ఘనంగా ముగించాలి. అలాగే 2023 వన్డే వరల్డ్ కప్‌ను తృటిలో చేజార్చుకున్న రోహిత్ సేన పొట్టి కప్‌ను సాధించి భారత అభిమానులకు కానుకగా అందించాలి.