టీ20 వరల్డ్ కప్-2024లో భారీ స్కోర్లు నమోదుకానప్పటికీ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. కెనడాపై అమెరికా రికార్డు ఛేదన చేసింది. వెస్టిండీస్‌ను దాదాపు ఓడించేలా పపువా న్యూ గినియా పోరాడింది. ఒమన్- నమీబియా మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. స్వల్ప స్కోరులు నమోదైన శ్రీలంక- దక్షిణాఫ్రికా పోరు ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగింది.
పొట్టి కప్ ఆరంభమై మూడు రోజులే గడిచినప్పటికీ అభిమానులకు వినోదం గొప్పగా అందుతోంది. ఈ టోర్నీ ప్రారంభం నుంచే రికార్డుల మోత మోగుతోంది. అమెరికా ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. వెస్టిండీస్‌తో కలిసి అగ్రరాజ్యం అమెరికా మెగాటోర్నీని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక పొట్టికప్ చరిత్రలో ఇరవై దేశాలు పాల్గొనడం ఇదే ప్రథమం.

ఈ మెగా టోర్నీలో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీ20 వరల్డ్ కప్-2024లో పాల్గొన్న పెద్దోడు-చిన్నోడుగా ఉగాండ ప్లేయర్ ఫ్రాంక్ న్సుబుగా, నేపాల్ క్రికెటర్ గుల్సన్ ఝా రికార్డులకెక్కారు. ఫ్రాంక్ న్సుబుగా వయస్సు 43. కాగా, ఐసీసీ ట్రోఫీల్లో ఫ్రాంక్ 16 ఏళ్ల వయస్సు నుంచే పాల్గొనడం విశేషం. 1997లో ఈస్ట్ అండ్ సెంట్రల్ ఆఫ్రికా తరఫున ఐసీసీ ఈవెంట్‌లో బరిలోకి దిగాడు. అయితే జూన్ 3న అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫ్రాంక్ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
మరోవైపు నేపాల్ ప్లేయర్ గుల్సన్ ఝా వయస్సు 18 ఏళ్లు. నిన్న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఆల్‌రౌండర్‌లో బరిలోకి దిగాడు. 15 బంతుల్లో 14 పరుగులు చేసి జట్టు స్కోరు 100 మార్క్ అందుకునేలా సాయపడ్డాడు. అలాగే బంతిని అందుకున్న గుల్సన్ రెండు ఓవర్లలో 17 పరుగులు ఇచ్చాడు. కాగా, ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ చేతిలో నేపాల్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
తొలుత నేపాల్ 19.2 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ పౌడెల్ (35; 37 బంతుల్లో, 5 ఫోర్లు) టాప్ స్కోరర్. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ బీక్ (3/18), టిమ్ ప్రింగిల్ (3/20) చెరో మూడు వికెట్లు, వాన్ మీకెరెన్ (2/19), బాస్ డీలీడె (2/22) తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో నెదర్లాండ్స్ 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. మ్యాక్స్ ఒడౌడ్ (54 నాటౌట్; 48 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) అజేయ అర్ధశతకం సాధించాడు.