టీ20 వరల్డ్ కప్‌లో సూపర్-8 రేసు ఆసక్తికరంగా మారింది. నమీబియాపై రికార్డు విజయంతో ఆస్ట్రేలియా తదుపరి దశకు ఘనంగా చేరుకుంది. ఆడమ్ జంపా (4/12) ధాటికి మొదట నమీబియా 17 ఓవర్లలో 72 పరుగులకు ఆలౌటైంది. గెర్హార్డ్ ఎరాస్మస్ (36; 43 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఆసీస్ బౌలర్లలో జంపాతో పాటు హేజిల్‌వుడ్, స్టొయినిస్ చెరో రెండు, కమిన్స్, నాథన్ ఎలిస్ తలో వికెట్‌తో సత్తాచాటారు. అనంతరం ఛేదనలో ఆస్ట్రేలియా 5.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించింది. ట్రావిస్ హెడ్ (34 నాటౌట్; 17 బంతుల్లో, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (20; 8 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్), మిచెల్ మార్ష్ (18 నాటౌట్, 9 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు.

ఇక లీగ్ స్టేజ్‌లో శనివారం స్కాట్లాండ్‌తో ఆస్ట్రేలియా తమ ఆఖరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టేబుల్ టాపర్‌గా నిలుస్తుంది. అయితే నమీబియాపై సాధించనట్లుగానే రికార్డు విజయం సాధించడానికి తాము ప్రయత్నించమని ఆస్ట్రేలియా పేసర్ జోస్ హేజిల్‌వుడ్ అన్నాడు. ఇంగ్లండ్‌ను లీగ్ స్టేజ్‌లోనే ఇంటికి పంపించడానికి ప్రయత్నిస్తామని తెలిపాడు. గ్రూప్-బీలో ఆస్ట్రేలియాతో పాటు స్కాట్లాండ్, నమీబియా, ఇంగ్లండ్, ఒమన్ జట్లు ఉన్నాయి.
ఇప్పటికే నమీబియా, ఒమన్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఇక సూపర్-8 అర్హత సాధించడం కోసం స్కాట్లాండ్, ఇంగ్లండ్ పోటీపడుతున్నాయి. ప్రస్తుతం మూడు మ్యాచ్‌లు ఆడిన స్కాట్లాండ్ (5 పాయింట్లు, +2.164)తో రెండో స్థానంలో, రెండు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ (1 పాయింట్, -1.800) నాలుగో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఘనంగా నెగ్గి, స్కాట్లాండ్ కంటే మెరుగైన నెట్‌రన్‌రేటు సాధించి తదుపరి దశకు అర్హత సాధించాలని ఇంగ్లండ్ భావిస్తోంది.
అయితే స్కాట్లాండ్‌పై ఘన విజయం సాధిస్తే ఇంగ్లండ్‌కు కలిసొస్తుందని, కాబట్టి ఆఖరి మ్యాచ్‌లో నామమాత్రంగా నెగ్గాలని హేజిల్‌వుడ్ పరోక్షంగా పేర్కొన్నాడు. ఇంగ్లండ్ సూపర్-8కు క్వాలిఫై అయితే తమతో పాటు ఇతర జట్లకు ప్రమాదకరమని, అందుకే లీగ్ స్టేజ్‌లోనే వాళ్లను నాకౌట్ చేయాలనుకుంటున్నామని వివరించాడు. ''టీ20 క్రికెట్‌లో ఇంగ్లండ్‌తో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కాబట్టి టోర్నీ నుంచి ఇంగ్లండ్‌ను ఇంటికి పంపిస్తే అది అందరికీ ఎంతో ప్రయోజనం. ఇది ఆసక్తికరంగా ఉంటుంది'' అని హేజిల్‌వుడ్ అన్నాడు.