టీ20 వరల్డ్ కప్‌లో లీగ్ దశ ఆసక్తికరంగా సాగుతోంది. రోజురోజుకు సూపర్-8 సమీకరణాలు మారిపోతున్నాయి. ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తదుపరి దశకు అర్హత సాధించాయి. మరోవైపు నమీబియా, ఒమన్ టోర్నీ నుంచి అధికారింకగా నిష్క్రమించాయి. మిగిలిన అన్ని జట్లకు ఇంకా అవకాశాలు ఉన్నప్పటికీ లీగ్ దశను మరో ఆరు జట్లు మాత్రమే దాటగలవు.
ఈ మెగాటోర్నీలో ఈసారి ఇరవై జట్లు పాల్గొన్న విషయం తెలిసిందే. అయిదు జట్ల చొప్పున నాలుగు గ్రూప్‌లుగా విడిపోయి తలపడతున్నాయి. ఆయా గ్రూప్‌ల్లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. అయితే గ్రూప్-ఏలో ఉన్న భారత్ అధికారికంగా ఇంకా తదుపరి దశకు క్వాలిఫై కాలేదు. కానీ ఆడిన రెండింట్లో విజయం సాధించి నాలుగు పాయింట్లతో టేబుల్ టాప్‌లోనే ఉంది. లీగ్ స్టేజ్‌లో టీమిండియా ఇంకా మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

ఇవాళ అమెరికాతో జరిగే మ్యాచ్‌లో భారత్ గెలిస్తే మరో మ్యాచ్ మిగిలుండగానే సూపర్-8కు చేరుకుంటుంది. జోరు మీదున్న టీమిండియా అమెరికాపై నెగ్గడం, గ్రూప్-ఏలో టేబుల్ టాపర్‌గా నిలవడం దాదాపు ఖాయమే. ఇక సూపర్-8లో ప్రత్యర్థి గురించి భారత్ ప్రణాళికలు రచించే సమయం స్టార్ట్ అయ్యింది. గ్రూప్-ఏ టాపర్‌గా భారత్ నిలిస్తే..గ్రూప్-బీ, గ్రూప్-డీలోని రెండో స్థానంలో నిలిచే జట్లతో, గ్రూప్-సీలో అగ్రస్థానంలో ఉన్న జట్టుతో మనం 'సూపర్ ఫైట్' చేయాల్సి ఉంటుంది.
అయితే ప్రస్తుత జట్ల బలాలు, పాయింట్లను బట్టి అంచనా వేస్తే భారత్ సూపర్-8 స్టేజ్‌లో బలమైన ప్రత్యర్థులతో పోటీపడే అవకాశాలు కనిపించట్లేదు. ఇంగ్లండ్, న్యూజిలాండ్ సూపర్-8 అవకాశాలు సంక్లిష్టం చేసుకోవడం టీమిండియాకు ఎంతో కలిసొచ్చింది. జూన్ 20న వెస్టిండీస్ లేదా అఫ్గానిస్థాన్‌తో భారత్ తొలి సూపర్ ఫైట్ చేసే అవకాశం ఉంది. ఇక జూన్ 22న బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్‌తో ఆడాల్సి ఉంటుంది. అలాగే జూన్ 24న స్కాట్లాండ్‌తో టీమిండియా పోరాడాల్సి ఉంది. వెస్టిండీస్/అఫ్గానిస్థాన్ మినహా బంగ్లాదేశ్/ నెదర్లాండ్స్, స్కాట్లాండ్ జట్లపై భారత్ సులువుగా విజయం సాధించగలదు. దీంతో రోహిత్ సేన సెమీ ఫైనల్‌కు చేరడం ఖాయమే!
భారత్ సూపర్-8 షెడ్యూల్ (అంచనా)
జూన్ 20- భారత్ వర్సెస్ వెస్టిండీస్/అఫ్గానిస్థాన్
జూన్ 22- భారత్ వర్సెస్ బంగ్లాదేశ్/నెదర్లాండ్స్
జూన్ 24- భారత్ వర్సెస్ స్కాట్లాండ్/ఇంగ్లండ్