టీ20 వరల్డ్ కప్-2024 ఆసక్తికరంగా సాగుతోంది. సిక్సర్ల సునామీ రాకపోయినా హోరాహోరీ మ్యాచ్‌లతో క్రికెట్ అభిమానులను అలరిస్తోంది. బలమైన జట్లకు కొన్ని పసికూన టీమ్స్ షాక్‌లు ఇస్తున్నాయి. మరికొన్ని మాత్రం పేలవమైన ప్రదర్శన చేస్తున్నాయి. ఆదివారం వెస్టిండీస్ చేతిలో ఉగాండ ఘోర పరాజయాన్ని చవిచూసింది. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత స్వల్ప స్కోరు చేసిన జట్టుగా నెదర్లాండ్స్ సరసన నిలిచింది.
గయానా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట వెస్టిండీస్ 20 ఓవర్లకు అయిదు వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఓపెనర్ చార్లెస్ (44; 42 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. మసాబ రెండు వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో ఉగాండ 12 ఓవర్లలో 39 పరుగులకే కుప్పకూలింది. మియాగి (13; 20 బంతుల్లో) మినహా ఎవరూ సింగిల్ డిజిట్ స్కోరు దాటలేకపోయారు. అకీల్ హొస్సేన్ (5/11) అయిదు వికెట్లతో విజృంభించాడు.

అయితే వెస్టిండీస్ చేతిలో ఉగాండ చిత్తుగా ఓడి న్యూజిలాండ్ కొంపముంచింది. టీ20 వరల్డ్ కప్ నుంచి కివీస్ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించే పరిస్థితికి తీసుకువచ్చింది. 134 పరుగుల భారీ తేడాతో ఉగాండ ఓటమి పాలవ్వడంతో వెస్టిండీస్‌కు నెట్‌రన్‌రేట్ గణనీయంగా పెరిగింది. +3.574కు చేరుకుంది. గ్రూప్-సీలో రెండు మ్యాచ్‌లు ఆడిన విండీస్ నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
మరోవైపు అఫ్గానిస్థాన్ ఆడిన రెండింట్లో గెలిచి నాలుగు పాయింట్లు, +5.225 నెట్‌రన్‌రేటుతో అగ్రస్థానంలో నిలిచింది. అఫ్గానిస్థాన్, వెస్టిండీస్ భారీ నెట్ రన్‌రేట్ సాధించడంతో న్యూజిలాండ్ సూపర్-8కు అర్హత సాధించే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. గ్రూప్-సీలో ప్రస్తుతం న్యూజిలాండ్ అట్టడుగున నిలిచింది. కివీస్ ఒక్క మ్యాచే ఆడినప్పటికీ ఆ జట్టు (-4.200) నెగటివ్ నెట్ రన్‌రేటుతో ఉంది. వెస్టిండీస్-ఉగాండ మ్యాచ్ ముందువరకు న్యూజిలాండ్ తదుపరి దశపై ఆశలతోనే ఉంది.
మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తే సూపర్-8కు క్వాలిఫై కావొచ్చని ప్రణాళికలు రచించుకుంది. కానీ వెస్టిండీస్ భారీ తేడాతో గెలవడంతో సమీకరణాలు మారిపోయాయి. వెస్టిండీస్, అఫ్గానిస్థాన్‌ను అధిగమించి న్యూజిలాండ్ సూపర్-8కు అర్హత సాధించాలంటే నెట్‌రన్ రేటు పరిగణనలోకి రాకుండా పాయింట్ల పరంగానే సాధించాలి. వెస్టిండీస్ లేదా అఫ్గానిస్థాన్‌తో సమానంగా పాయింట్లు సాధిస్తే ఇంటిముఖం పట్టాల్సిందే. ఎందుకంటే కివీస్ మైనస్ 4 రన్‌రేటుతో ఉంది. అది పాజిటివ్‌లోకి వచ్చి +2 దాటాలంటే అద్భుత విజయాలు సాధించాలి.
పాయింట్ల పరంగా.. వెస్టిండీస్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, న్యూజిలాండ్ అన్నింట్లో విజయం సాధిస్తే నెట్‌రన్‌రేటుతో సంబంధం లేకుండా విలియమ్సన్ సేన సూపర్-8కు అర్హత సాధిస్తుంది. వెస్టిండీస్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్‌తో తలపడనుంది. మరోవైపు అఫ్గానిస్థాన్ కూడా తమ మిగిలిన మ్యాచ్‌ల్లో పరాజయాన్ని చవిచూస్తే కివీస్‌కు కలిసొస్తుంది. గ్రూప్ స్టేజ్‌లో పపువా న్యూ గినియా, వెస్టిండీస్‌తో అఫ్గాన్ పోటీపడాల్సి ఉంది.