తాను కష్టకాలం ఎదుర్కొంటున్నట్లు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య అంగీకరించాడు. ఐపీఎల్-2024లో హార్దిక్ చేదు అనుభవాలు ఎదురైన విషయం తెలిసిందే. హార్దిక్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఆల్‌రౌండర్‌గా తన స్టార్‌డమ్‌కు తగిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో 18 సగటుతో 216 పరుగులు చేశాడు. అంతేగాక ముంబై, రోహిత్ అభిమానుల నుంచి హేళన ఎదుర్కొన్నాడు.
అయితే టీ20 వరల్డ్ కప్‌కు సన్నాహకంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ బ్యాటుతో మెరిశాడు. 23 బంతుల్లో అజేయంగా 40 పరుగులు చేశాడు. రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదాడు. మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 30 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. కాగా, బంగ్లా మ్యాచ్ ముగిసిన అనంతరం స్టార్ స్పోర్ట్స్‌తో హార్దిక్ మాట్లాడాడు. తాను క్లిష్టసమయంలో ఉన్నాడని, అయితే ధైర్యంగా పోరాడటం తనకి అలవాటే అని పేర్కొన్నాడు.

''యుద్ధంలో నిలబడాలి. కొన్నిసార్లు మనం క్లిష్టపరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే అది మైదానమైనా, యుద్ధమైనా విడిచిపెట్టి వెళ్లకూడదు. అలా వెళ్తే మనం ఆశించింది సాధించలేం. అవును, నేను క్లిష్టపరిస్థితులు ఎదుర్కొంటున్నాను. వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాను. గుడ్-బ్యాడ్ టైమ్ వస్తుంటాయి, వెళ్తుంటాయి. ఇదో దశ మాత్రమే. ఫర్వాలేదు. గతంలో ఇలాంటి సందర్భాలను అధిగమించాను''
''నా విజయాల గురించి నేను పట్టించుకోను. అక్కడే వాటిని మరిచిపోతుంటాను. కష్టకాలాన్ని కూడా అంతే. మన నైపుణ్యాన్ని మెరుగుపర్చుకుంటూ శ్రమిస్తే అధిగమించవచ్చు. మన కష్టం ఎప్పటికి వృథా కాదు. ఆత్మవిశ్వాసంతో పోరాడుతుంటాను. ఆత్మపరిశీలన చేసుకుంటుంటాను. ప్రస్తుతం నా వయస్సు 30. అయితే 16 ఏళ్ల హార్దిక్‌తో పోలిస్తే ఇప్పుడు నా పని ఎంతో సులువు. ఆ 16 ఏళ్ల కుర్రాడితో ఇలా ప్రశ్నిస్తాను... ఎలా సాధించావ్? ఎందుకు చేశావ్?''
''ఆ సమయంలో నాకెలాంటి సౌకర్యాలు, అవకాశాలు లేవు. కష్టమే నాకు అవకాశాలను సృష్టించింది. గెలుపు తలుపులు తెరిచింది. ప్రస్తుతం నేను అదే జోన్‌లో ఉన్నాను. ఇప్పుడేం చేయాలో ఆ 16 ఏళ్ల కుర్రాడినే అడుగుతాను. అతనే నాకు అసలైన ప్రేరణ. ఆ కుర్రాడు వేసిన పునాదితోనే నేను ఇక్కడ వరకు వచ్చాను'' అని హార్దిక్ పాండ్య అన్నాడు.