మరికొన్ని గంటల్లో టీ20 వరల్డ్ కప్-2024 ప్రారంభంకానుంది. ఈ మెగాటోర్నీకి అమెరికా-వెస్టిండీస్ ఉమ్మడిగా ఆతిథ్యం ఇస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈ మహా సమరంలో కప్ వేటకు ఏకంగా ఇరవై దేశాలు బరిలోకి దిగుతున్నాయి. నాలుగు గ్రూప్‌లు విడిపోయి తలపడనున్నాయి. కప్ లక్ష్యంగా యూఎస్‌ఏలో అడుగుపెట్టిన భారత్ టోర్నీలో హాట్ ఫేవరేట్.
గత వన్డే వరల్డ్ కప్‌ను తృటిలో చేజార్చుకున్న రోహిత్ సేన ఈసారి పొట్టి కప్‌ను అందుకునే వెళ్లాలని పట్టుదలతో సన్నద్ధమవుతోంది. అయితే మన జట్టుకు ప్రత్యర్థులుగా మనోళ్లే బరిలోకి దిగుతుండటం గమనార్హం. భారత సంతతికి చెందిన 15 మంది ఆటగాళ్లు వివిధ జట్ల తరఫున టీ20 వరల్డ్ కప్‌లో ఆడనున్నారు. దీంతో ఈ ప్రపంచకప్‌లో ఏదో దశలో టీమిండియాతో ప్రత్యర్థిగా వాళ్లు తలపడనున్నారు.

ఈ ఆటగాళ్లలో కొందరు భారత దేశవాళీ క్రికెట్ కూడా ఆడారు. యూఎస్‌ఏ ప్రకటించిన జట్టులో ఏకంగా ఆరుగురు మనోళ్లే ఉన్నారు. అమెరికా జట్టులో కెప్టెన్ మోనాంక్ పటేల్, హర్మీత్ సింగ్, మిలింద్ కుమార్, నిసార్గ్ పటేల్, నితీశ్ కుమార్, సౌరభ్ నేత్రవల్కర్ ఉన్నారు. ముంబైలో జన్మించిన సౌరభ్ 2010లో భారత అండర్-19 జట్టు తరఫున ఆడాడు. ఈ ఎడమచేతి వాటం పేసర్ కేఎల్ రాహుల్, హర్షల్ పటేల్‌తో కలిసి ఆడాడు. యూఎస్ఏ తరఫున సౌరభ్ టీ20ల్లో 27, వన్డేల్లో 73 వికెట్లు పడగొట్టాడు.
ఢిల్లీలో జన్మించిన మిలిందర్ కుమార్ ఢిల్లీ, సిక్కీం తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ, ఆర్సీబీ తరఫున కూడా ప్రాతినిథ్యం వహించాడు. ఇక హర్మీత్ సింగ్ 2012లో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. యూఎస్‌ఏకు నేతృత్వం వహిస్తున్న మోనాంక్ పటేల్ గుజరాత్‌లో జన్మించాడు. అమెరికాకు వెళ్లే ముందు మోనాంక్ గుజరాత్ స్టేట్ టీమ్‌కు ఆడాడు.
కెనాడా జట్టులో భారత సంతతికి చెందిన ఆటగాళ్లు నలుగురు ఉన్నారు. రవీందర్‌పాల్ సింగ్, నిఖిల్ దత్తా, వర్గత్ సింగ్, శ్రేయస్ కెనాడా తరఫున బరిలోకి దిగుతున్నారు. న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర, దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ కేశవ్ మహరాజ్ కూడా భారత సంతతికి చెందినవారే. ఉగాండా ఆల్‌రౌండర్ అల్ఫేష్ రంజానీ ముంబైలో జన్మించాడు.
టీ20 వరల్డ్ కప్: భారత సంతతి ఆటగాళ్లు జాబితా
అమెరికా: మోనాంక్ పటేల్, హర్మీత్ సింగ్, మిలిందర్ కుమార్, నిసార్గ్ పటేల్, నితీశ్ కుమార్, సౌరభ్ నేత్రవల్కర్
కెనడా: రవీందర్‌పాల్, నిఖిల్ దత్తా, వర్గత్ సింగ్, శ్రేయస్
ఉగాండ: అల్పేష్ రంజానీ, రోనక్ పటేల్
ఒమన్: కశ్యప్ ప్రజాపతి
న్యూజిలాండ్: రచిన్ రవీంద్ర
దక్షిణాఫ్రికా: కేశవ్ మహరాజ్