మరో నాలుగు రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మహా సమరంలో టైటిల్ కోసం ఇరవై దేశాలు పోటీపడుతున్నాయి. జూన్ 2వ తేదీ నుంచి మొదలుకానున్న ఈ మెగాటోర్నీకి అమెరికా-వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తున్నాయి. ప్రపంచకప్‌కు సన్నాహకంగా సోమవారం నుంచి వార్మప్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి.
అయితే వార్మప్ మ్యాచ్‌ల్లో బరిలోకి దిగడానికి ఆస్ట్రేలియా వద్ద 11 మంది రెగ్యులర్ ప్లేయర్లు కూడా లేరు. మంగళవారం నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. మైదానంలో జట్టుకు సరిపడే ఫీల్డర్లు లేకపోవడంతో చీఫ్ సెలక్టర్, కోచింగ్ స్టాఫ్ ఫీల్డింగ్‌కు రావాల్సి వచ్చింది. ఐపీఎల్ కారణంగా స్టార్ ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు.

ఐపీఎల్-2024 సీజన్ ఆదివారంతో ముగిసిన విషయం తెలిసిందే. ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. అయితే ప్లేఆఫ్స్‌లో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్ ఆడారు. దీంతో విశ్రాంతి కారణంగా ఈ కీలక ఆటగాళ్లు వార్మప్ మ్యాచ్‌లకు దూరమయ్యారు. అంతేగాక మిచెల్ మార్ష్ గాయం కారణంగా మైదాన్ని వీడటంతో నమీబియా మ్యాచ్‌కు 9 మంది ఆటగాళ్లే అందుబాటులో ఉన్నారు.
దీంతో ఆస్ట్రేలియా చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ, ప్రధాన కోచ్ మెక్‌డొనాల్డ్, ఫీల్డింగ్ కోచ్ ఆండ్రీ బోర్‌వెక్, బ్యాటింగ్ కోచ్ బ్రాడ్ హాడ్జ్ ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది. ఈ నలుగురులో బెయిలీ, బోర్‌వెక్ పూర్తి ఓవర్ల పాటు మైదానంలోనే ఉండటం గమనార్హం. బెయిలీకి 41, బోర్‌వెక్‌కు 46 ఏళ్ల వయస్సు. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. జేన్ గ్రీన్ (38; 30 బంతుల్లో, 5x4) టాప్ స్కోరర్.
జంపా మూడు, హేజిల్‌వుడ్ రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో ఆస్ట్రేలియా 10 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. డేవిడ్ వార్నర్ (54; 21 బంతుల్లో, 6x4, 3x6) అజేయ అర్ధశతకం సాధించాడు. టిమ్ డేవిడ్ (23; 16 బంతుల్లో, 3x4, 1x6) దూకుడుగా ఆడాడు. కాగా, గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్‌లాండ్, ఒమన్, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి.