టీ20 వరల్డ్ కప్-2024లో అఫ్గానిస్థాన్ ఘనంగా బోణీ కొట్టింది. గయానా వేదికగా మంగళవారం ఉగాండతో జరిగిన మ్యాచ్‌లో 125 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. స్లో పిచ్‌పై ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటి రెండు పాయింట్లు గెలిచి గ్రూప్-సీలో టాప్‌లో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 183 పరుగులు చేసింది.
ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ (76; 45 బంతుల్లో, 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్ (70; 46 బంతుల్లో, 9 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధశతకాలతో చెలరేగారు. కాస్మస్ (2/25), బ్రియాన్ మసాబా (2/21) చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనకు వచ్చిన ఉగాండ 16 ఓవర్లలో 58 పరుగులకే కుప్పకూలింది. రాబిన్సన్ (14; 25 బంతుల్లో, 1 సిక్సర్) టాప్ స్కోరర్. ఫజల్లా ఫరూకీ (5/9) అయిదు వికెట్లతో విజృంభించాడు. రషీద్ ఖాన్ (2/12), నవీనుల్ హక్ (2/4) చెరో రెండు వికెట్లతో సత్తాచాటారు.

ఫరూకీ ధాటికి పసికూన ఉగాండ ఆది నుంచే వికెట్లు కోల్పోయింది. ఏ దశలోనూ ప్రతిఘటించలేదు. 18 పరుగులకే సగం మంది బ్యాటర్లు పెవిలియన్‌కు చేరారు. ఈ దశలో రియాజత్ (11; 34 బంతుల్లో) కలిసి రాబిన్సన్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరి డిఫెన్స్ ఎక్కువ సేపు నిలవలేకపోయింది. ఫరూకీ మరోసారి చెలరేగి ఉగాండను కోలుకోలేని దెబ్బతీశాడు. ఆ తర్వాత రషీద్ తన మ్యాజిక్‌తో మ్యాచ్‌ను తొందరగా ముగించాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన అఫ్గానిస్థాన్ 200+ స్కోరును సునాయాసంగా అందుకునేది. ఓ దశలో 14 ఓవర్లకు 152/0తో పటిష్టస్థితిలో నిలిచింది. కానీ ఉగాండ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. క్రమంగా వికెట్లు తీస్తూ స్కోరుబోర్డును కట్టడి చేశారు. చివరి ఆరు ఓవర్లలో 31 పరుగులే ఇచ్చి అయిదు వికెట్లు పడగొట్టారు. నజీబుల్లా (2; 3 బంతుల్లో), మహ్మద్ నబీ (14*; 16 బంతుల్లో), గుల్బాదిన్ (4; 5 బంతుల్లో), అజ్మతుల్లా (5; 5 బంతుల్లో) నిరాశపరిచారు. ఓపెనర్లు మినహా మిగిలిన బ్యాటర్లెవరూ బౌండరీ సాధించకపోవడం గమనార్హం.