
ముంబై: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌కు భారత క్రికెట్ జట్టు సన్నద్ధమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో- అన్నీ అపశకునాలే ఎదురవుతున్నాయి. ఒక్కో ప్లేయర్ తప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది- ప్రత్యేకించి బౌలర్లు. ఈ మెగా ఈవెంట్ నుంచి ఇప్పటికే స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వైదొలిగారు. ఇప్పుడు తాజాగా మరో బౌలర్ తప్పుకొన్నాడు. దీపక్ చాహర్ గాయపడ్డాడు. ఫలితంగా టోర్నమెంట్ నుంచి అవుట్ అయ్యాడు.
టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ఆడటానికి ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లిన జట్టులో దీపక్ చాహర్ రిజర్వ్ ప్లేయర్. నెట్ ప్రాక్టీస్‌లో జట్టుతో పాటు శ్రమిస్తోన్నాడు. టీ20 స్పెషలిస్ట్ బౌలర్‌గా అతనికి గుర్తింపు ఉంది. ఇదివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్స్, ఆ తరువాత టీ20 ఇంటర్నేషనల్స్‌పై తనదైన ముద్ర వేశాడు. అతణ్ని జట్టులోకి రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపిక చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ సెలెక్షన్ కమిటీ. ఇప్పుడతను జట్టు నుంచి తప్పుకొన్నాడు.
బ్యాక్ పెయిన్‌తో బాధపడుతున్నాడు దీపక్ చాహర్. అతను తప్పుకోవడం ఖాయమంటూ ఇదివరకే వార్తలొచ్చాయి.. గానీ వాటిని బీసీసీఐ అధికారికంగా ధృవీకరించలేదు. రీప్లేస్ కూడా ప్రకటించలేదు. దీనితో- టీ20 ప్రపంచకప్ సూపర్ 12 మ్యాచ్‌లు ఆరంభం అయ్యే సమయానికి చాహర్ కోలుకుంటాడని అందరూ భావించారు. వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది.
దీపక్ చాహర్ జట్టు నుంచి వైదొలగినట్లు బీసీసీఐ వెల్లడించింది. అతనికి రీప్లేస్‌గా మరో స్పీడ్‌స్టర్ శార్దుల్ ఠాకూర్‌ను ఎంపిక చేసింది. శార్దుల్ ఠాకూర్ త్వరలో ఆస్ట్రేలియా విమానం ఎక్కబోతోన్నాడు. ప్రస్తుతం పెర్త్‌లో ఉంటోన్న జట్టును కలవబోతోన్నాడు. శార్దుల్ ఠాకూర్‌తో పాటు వెటరన్ పేస్ బౌలర్ మహ్మద్ షమీ కూడా ఆస్ట్రేలియా వెళ్లడం ఖాయమైంది.
జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో అతణ్ని జట్టులోకి తీసుకున్నారు బీసీసీఐ సెలెక్టర్లు. టీ20 ప్రపంచకప్ జట్టును ప్రకటించే సమయానికి షమీ కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. ఇప్పుడతను పూర్తిగా కోలుకున్నాడు. వందశాతం ఫిట్‌నెస్ సాధించాడు. దీనితో అతణ్ని ఆస్ట్రేలియాకు పంపించనుంది బీసీసీఐ. శార్దుల్ ఠాకూర్, మహ్మద్ షమీ ఇద్దరూ టీమిండియాతో కలవనున్నారు.