
దుబాయ్: యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2021లో టీమిండియా ఆటగాళ్లు ధరించే జెర్సీలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం ఆవిష్కరించింది. కిట్ స్పాన్సర్ ఎంపీఎల్ స్పోర్ట్స్‌తో సంయుక్తంగా బీసీసీఐ ఈ జెర్సీని రూపొందించింది. ఈ కొత్త కిట్‌ను 'బిలియన్ చీర్స్ జెర్సీ' అని పిలుస్తారని బీసీసీఐ పేర్కొంది. మునుపటి జెర్సీలతో పోలిస్తే.. ముదురు నీలం రంగులో కొత్త జెర్సీలు ఉన్నాయి. 1992 ప్రపంచకప్ జెర్సీల మాదిరిగా ఉన్నాయి. బీసీసీఐ పోస్ట్ చేసిన ట్వీటులో లోకేష్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా మరియు జస్ప్రీత్ బుమ్రాలు కొత్త జెర్సీలను దరించి ఫొటోలకు పోజులిచ్చారు.
అయితే టీ20 ప్రపంచకప్ 2021లో టీమిండియా ఆటగాళ్లు ధరించే జెర్సీ చిత్రాలను యూఏఈ అధికారులు బుధవారం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు. జెర్సీ విడుదలకు సంబంధించిన వీడియోను కూడా ప్లే చేశారు. దాంతో అభిమానులు అందరూ ఒక్క్కసారిగా ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా బుర్జ్ ఖలీఫాపై కోహ్లీ, రోహిత్, జడేజాల ఫొటోలు తళుక్కున మెరిసాయి. దీంతో భారత ఫాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు సంబందించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
గతేడాది కూడా ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చిత్రాన్ని బూర్జ్ ఖలీపాపై ప్రదర్శించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ బూర్జ్ ఖలీఫాపై ఓ భారత క్రికెటర్ ఫొటో కనిపించడం అదే తొలిసారి. గతంలో మహాత్మా గాంధీ, షారుక్ ఖాన్‌ల ఫొటోలను బూర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు. ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభంలో కోల్‌కతా నైట్ రైడర్స్ లోగో, ఆటగాళ్ల ఫొటోలను బూర్జ్ ఖలీపాపై ప్రదర్శించారు. ఇప్పుడు టీమిండియా ఆటగాళ్ల జెర్సీ చిత్రాలను ప్రదర్శించారు.
క్రికెట్ అభిమానుల 'చీర్స్' ప్రేరణతో భారత జట్టు జెర్సీలను రూపొందించినట్లు బీసీసీఐ తమ ట్విట్టర్‌లో వెల్లడించింది. టీమిండియా జట్టుకు కిట్ స్పాన్సర్‌గా ఎంపీఎల్ స్పోర్ట్స్ వ్యవహరిస్తోంది. ఈ జెర్సీలు కావాలనుకున్నవారు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు. మీ గేమ్‌ను చూపించడానికి సిద్ధంగా ఉండండి అని బీసీసీఐ ట్వీట్ చేసింది. మాములుగా భారత ఆటగాళ్లు ధరించే జెర్సీల కంటే ఈసారి కలర్ డోస్‌ను పెంచేశారు. మెన్‌ఇన్ బ్లూ కాస్త.. థిక్ బ్లూగా మారిపోయింది. నైక్ సంస్థతో కాంట్రాక్ట్ పూర్తికావడంతో.. టీమిండియా కిట్ కొత్త స్పాన్సర్‌గా ఎంపీఎల్‌ను ఎంచుకుంది. ఇందులో భాగంగానే ఎంపీఎల్ స్పోర్ట్స్ భారత ఆటగాళ్లకు కొత్త జెర్సీలను అందజేసింది.