
దుబాయ్: ఎప్పుడెప్పుడా అంటూ క్రికెట్ ప్రేమికులు ఎదురు చూస్తోన్న మెగా క్రికెట్ ఈవెంట్.. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్. దీనికి సంబంధించిన తాజా అప్‌డేట్స్‌ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ లీక్ చేసింది. ఈ టోర్నమెంట్ మొదలు కావడానికి ఇంకా రెండునెలల సమయం ఉంది. ఈ మధ్యలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్‌లో మిగిలిపోయిన మ్యాచ్‌లను కూడా ఆడాల్సి ఉంది. అయినప్పటికీ.. టీ20 ప్రపంచకప్ రేపుతోన్న హీట్ వేరు. అందులోనూ- చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఆకాశాన్నంటుకునేలా ఉంటాయి అంచనాలు.
క్రికెట్ ఆడే అన్ని దేశాలు పాల్గొనే ఐసీసీ గుర్తింపు ఉన్న టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ కావడం వల్ల భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ మ్యాచ్ ఎప్పుడనేది ఇప్పటిదాకా తెలియదు. ఎవరి అంచనాలకు కూడా అందలేదు. తాజాగా దీనిపై ఐసీసీ ఓ అప్‌డేట్ ఇచ్చింది. భారత్-పాకిస్తాన్ మధ్య సాగే మ్యాచ్‌కు సంబంధించిన తేదీని వెల్లడించింది. ఆ తేదీ- అక్టోబర్ 24. ఆ రోజు భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ఉంటుందని ఐసీసీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. దీనిపై ఎఎన్ఐ వార్తా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. ఐసీసీ వర్గాల ద్వారా ఈ విషయం తెలిసినట్లు పేర్కొంది. దుబాయ్ స్టేడియం దీనికి వేదికగా మారుతుంది.
టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ఎప్పటి నుంచి మొదలవుతుందనే విషయాన్ని ఐసీసీ ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం- అక్టోబర్ 17వ తేదీన టోర్నమెంట్ ఆరంభమౌతుంది. నవంబర్ 14వ తేదీన ముగుస్తుంది. ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆ టోర్నీ సాగుతుంది. ఇందులో అక్టోబర్ 24వ తేదీన గ్రూప్-2లో భాగంగా సూపర్ 12లో భారత్-పాకిస్తాన్ జట్లు తలపడతాయని ఐసీసీ వర్గాలు వెల్లడించినట్లు ఏఎన్ఐ తెలిపింది. ఇది గ్రూప్ దశలో సాగే మ్యాచ్. ఈ ఏడాది మార్చి 20వ తేదీన ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్ ఆధారంగా గ్రూప్స్‌లు ఏర్పాటయ్యాయి.
సూపర్ 12లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఉన్నాయి. రౌండ్ 1లో క్వాలిఫై అయిన రెండు జట్లు ఈ గ్రూప్‌లో చేరుతాయి. అంటే అప్పటికి ఈ గ్రూప్‌లో ఉండే జట్ల సంఖ్య నాలుగు నుంచి ఆరుకు పెరుగుతుంది. గ్రూప్ 2లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, అఫ్ఘనిస్తాన్‌లు ఉన్నాయి. రౌండ్ 2లో క్వాలిఫై అయిన రెండు జట్లు భారత్ ఉన్న గ్రూప్‌లో చేరుతాయి. ఇక్కడ కూడా మొత్తం జట్ల సంఖ్య ఆరుకు పెరుగుతుంది. తొలి రౌండ్‌లో అర్హత సాధించడానికి మొత్తం ఎనిమిది జట్లు తలపడాల్సి ఉంటుంది. ఈ ఎనిమిదింట్లో శ్రీలంక, బంగ్లాదేశ్ ఆటోమేటిక్‌గా అర్హత సాధిస్తాయి. ఇందులో క్వాలిఫై గ్రూప్-ఏలో ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా, శ్రీలంక, గ్రూప్-2లో ఒమన్, పపువా న్యూగినియా, స్కాట్లాండ్ జట్లు బంగ్లాదేశ్‌తో ఆడాల్సి ఉంటుంది.