
హైదరాబాద్: భారత టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలకు విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పేసిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ 2021కు ముందే భారత జట్టు టీ20 పగ్గాలు వదిలిస్తున్నా అని కోహ్లీ చెప్పేశాడు. మెగా టోర్నీలో భాగంగా సోమవారం దుబాయ్ వేదికగా నమీబియాతో జరిగిన టీ20 మ్యాచ్.. కెప్టెన్‌గా కోహ్లీకి చివరిది. ఆ మ్యాచ్‌లో భారత్ ఘన విజయాన్ని నమోదు చేసింది. నమీబియా నిర్ధేశించిన స్వల్ప లక్షాన్ని భారత్ 15.2 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 136 పరుగులు చేసింది. అయినా కూడా ప్రపంచకప్ 2021 సెమీస్‌కు మాత్రం కోహ్లీసేన అర్హత సాధించలేకపోయింది.
టీమిండియాకు విరాట్ కోహ్లీ 50 మ్యాచుల్లో టీ20 జట్టుకు సారథ్య బాధ్యతలు నిర్వర్తించాడు. కోహ్లీ నాయకత్వంలో భారత్ 32 టీ20 మ్యాచ్‌లను గెలిచింది. మరో 16 మ్యాచ్‌లను ఓడిపోయింది. ఇక రెండు మ్యాచ్‌లలో ఫలితం రాలేదు. టీ20లలో కోహ్లీ సారథ్యంలో భారత్ ఐసీసీ ట్రోఫీ గెలవకపోయినా.. మంచి విజయాలు అందించాడు. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా.. టెస్టులు, వన్డేలకు మాత్రం కోహ్లీనే పగ్గాలు చేపట్టనున్నాడు. టీమిండియా టీ20 మ్యాచ్‌లకు ఇక నుంచి కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మ చేపడుతాడని కోహ్లీ నమీబియాతో మ్యాచ్‌లో చెప్పకనే చెప్పాడు.
కెరీర్‌లో ఎన్నో సాధించినా, కెప్టెన్‌గా ఎన్ని ఘనతలు అనుకున్నా.. ఐసీసీ ట్రోఫీ మాత్రం విరాట్ కోహ్లీకి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ప్లేయర్‌గా 2011 ప్రపంచకప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ గెలిచిన కోహ్లీ.. కెప్టెన్‌గా ఒక్క టైటిల్ అందించలేకపోయాడు. వ్యక్తిగతంగా ఎన్ని ఘనతలు సాధించినా.. సగటు క్రికెట్ అభిమాని ట్రోఫీలనే లెక్కలోకి తీసుకుంటాడు. కానీ కోహ్లీకి ఆ అదృష్టం లేదు. జట్టు కోసం నిరంతరం తపిస్తూ, చెమట చిందిస్తూ ఆడే అతనికి ఐసీసీ ట్రోఫీ ఎప్పటి నుంచో ఊరిస్తోంది. అదే విమర్శకులకు అస్త్రంగా మారింది. కెప్టెన్‌గా జట్టును ఎంతో దృఢంగా మలుస్తూ, యువకులకు ప్రేరణ కలిగిస్తూ ఉండే నాయకుడికి, విదేశీ క్రికెటర్లలోనూ స్థైర్యం నింపే ఈ సారథికి.. ఈ ఒక్క కారణంగా ప్రస్తుతం విమర్శలు తీవ్రమయ్యాయి. అదే అతని కెరీర్‌కు లోటుగా మిగిలిపోయింది.
2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 96 టెస్టులాడి 51.1 సగటుతో 77765 రుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు (7 డబుల్ సెంచరీలు) 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 254 వన్డేల్లో 59.1 సగటుతో 12169 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 62 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 95 టీ20లలో 52.0 సగటుతో 3227 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 23 వేలకు పైగా పరుగులు చేశాడు. మరోవైపు కోహ్లీ 207 ఐపీఎల్ మ్యాచులు ఆడి 6283 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా ఐదు సెంచరీలు ఉండడం విశేషం.