అశుతోష్ శర్మ.. ఇప్పుడీ పేరు దేశం మొత్తం వినిపిస్తోంది. 12 ఏళ్ల క్రితం యువరాజ్ సింగ్ సాధించిన రికార్డ్ ను అశుతోష్ బద్దలు కొట్టాడు. ఎవ్వరూ టచ్ చేయలేరనుకున్న రికార్డ్ ని 25 ఏళ్ల ఈ కుర్రాడు అలవోకగా అధిగమించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జరిగిన మ్యాచ్ లో అశుతోష్ ఈ ఘనత సాధించాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023 టీ20 టోర్నీలో రైల్వేస్ జట్టు తరపున అశుతోష్ బరిలోకి దిగాడు. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చాడు. తొలి బంతి నుంచే అరుణాచల్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. బౌండరీల మోత మోగించాడు. దీంతో కేవలం 11 బంతుల్లో 8 సిక్సులు, 1 ఫోర్ సహాయంతో, 441.66 స్ట్రైక్ రేట్‌తో హాఫ్ సెంచరీ బాదేశాడు.

అశుతోష్ హాఫ్ సెంచరీతో 12 ఏళ్లనాటి యువరాజ్ సింగ్ రికార్డ్ బద్దలైంది. 2007 టీ20 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో యువరాజ్ ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికారేశాడు. ఆ మ్యాచులో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన భారతీయ ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
ఇప్పుడా రికార్డును అశుతోష్ బద్దలుకొట్టాడు. కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి.. అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన భారతీయ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. కాగా.. ఆసియా క్రీడల ముందు వరకు ప్రపంచ క్రికెట్లో అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రికార్డ్ యువరాజ్ పేరునే ఉండేది.
కానీ మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ బ్యాటర్ దీపెంద్ర సింగ్ కేవలం 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది ఆ రికార్డును తన పేరున నమోదు చేసుకున్నాడు. ఇదిలా ఉంటే 2007లో జరిగిన ఆ మ్యాచ్ లోనే యువరాజ్ మరో రికార్డు కూడా సృష్టించాడు. ఇంగ్లీష్ బౌలర్ బ్రాడ్ ఓవర్లో 6 బంతుల్లో 6 సిక్సులు బాది వైట్ బాల్ క్రికెట్లో ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు.