దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ విధ్వంసం సృష్టించాడు. తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ మేఘాలయపై శతకంతో కదం తొక్కాడు. 67 బంతుల్లో ఏకంగా 151 పరుగులు బాదాడు. 14 ఫోర్లు, 10 సిక్సర్లతో ఊచకోతకు దిగాడు. టీ20ల్లో తిలక్‌కు వరుసగా ఇది మూడో సెంచరీ. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ తిలక్ శతకం సాధించిన సంగతి తెలిసిందే.
దక్షిణాఫ్రికా మూడు, నాలుగో టీ20ల్లో వన్‌డౌన్‌లో వచ్చిన అతను అజేయంగా 107, 120 పరుగులు బాదాడు. కాగా, మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లోనూ తిలక్ మూడో స్థానంలోనే బ్యాటింగ్‌కు వచ్చాడు. ఓపెనర్ రాహుల్ సింగ్ డకౌటవ్వడంతో తొలి ఓవర్‌లోనే క్రీజులోకి వచ్చిన తిలక్ ఆఖరి బంతికి ఔటై పెవిలియన్‌కు చేరాడు. కెప్టెన్ తిలక్ వర్మతో పాటు తన్మయ్ అగర్వాల్ (55; 23 బంతుల్లో, 4 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా చెలరేగడంతో.. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 248 పరుగులు చేసింది.

రాహుల్ బుద్ధి (30; 23 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులు చేశాడు. మేఘాలయ బౌలర్లలో డిప్పు సిగ్మా రెండు వికెట్లు, ఆకాశ్ చౌదరి ఒక వికెట్ తీశారు. ఆదిలోనే వికెట్ పడగొట్టి హైదరాబాద్‌ను ఆకాశ్ దెబ్బ తీసినా, తిలక్ వర్మ రాకతో ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. క్రీజులో కుదురుకునే వరకు ఓపిక పట్టిన తిలక్ ఆ తర్వాత దాడికి దిగాడు. తిలక్‌తో పాటు తన్మయ్ కూడా సత్తాచాటడంతో 10 ఓవర్లకు హైదరాబాద్ 123 పరుగులు చేసింది. అనంతరం తన్మయ్ ఔటైనప్పటికీ తిలక్ ఆఖరి వరకు నిలబడి స్కోరుబోర్డు పరుగులు పెట్టించాడు.
దేశావాళీ ధనాధన్ క్రికెట్ టోర్నీలో మొత్తం 38 జట్లు అయిదు గ్రూప్‌లుగా పాల్గొంటున్నాయి. డిసెంబర్ 15వరకు ఈ టోర్నీ జరగనుంది. గ్రూప్-ఏలో హైదరాబాద్, మేఘాలయ, మధ్యప్రదేశ్, బెంగాల్, పంజాబ్, మిజోరం, బిహార్, రాజస్థాన్ ఉన్నాయి. గ్రూప్-బీలో బరోడా, సిక్కిం, గుజరాత్, సౌరాష్ట్ర, కర్ణాటక, ఉత్తరాఖండ్, తమిళనాడు, త్రిపుర; గ్రూప్ -సీలో హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, హరియాణా, జమ్మూ కశ్మీర్, మణిపూర్, ఢిల్లీ, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్; గ్రూప్-డీలో ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరి, అస్సాం, విదర్భ, రైల్వేస్, ఒడిశా, చండీగఢ్ ఉన్నాయి. అలాగే గ్రూప్ -ఇలో ఆంధ్ర, నాగాలాండ్, కేరళ, ముంబై, గోవా, సర్వీసెస్, మహారాష్ట్ర పోటీపడనున్నాయి.