
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఫోర్లు, సిక్సులతో హోరెత్తిస్తున్నాడు. ఆసీస్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ.. అద్భుత హాఫ్ సెంచరీ చేశాడు. స్పిన్నర్ నాథన్ లైయాన్ వేసిన 57వ ఓవర్ మూడో బంతికి సింగల్ తీసిన పంత్.. అర్ధ శతకం మార్క్ అందుకున్నాడు. వన్డే తరహాలో ఆడుతూ.. 64 బంతుల్లోనే భారత యువ వికెట్ కీపర్ హాఫ్ సెంచరీ చేయడం విశేషం. పంత్ ధాటిగా ఆడుతుండంతో టీమిండియా లక్ష్యం దిశగా దూసుకెళుతోంది.
సోమవారం ఉదయం 98/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఐదవ రోజు ఆట ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ అజింక్య రహానే (4) తన వ్యక్తిగత ఓవర్‌నైట్ స్కోర్ వద్దే ఔట్ అయ్యాడు. ఈరోజు ఉదయం రెండో ఓవర్లోనే ఆసీస్ కెప్టెన్ టీమ్ పైన్.. స్పిన్నర్ నాథన్ లైయాన్ చేతికి బంతినిచ్చాడు. అది ఫలితాన్నిచ్చింది. లైయాన్ నాలుగో బంతికే రహానేను ఔట్ చేశాడు. బంతి ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మాథ్యూ వేడ్ చేతుల్లో పడింది. అప్పటికి భారత్ కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసింది.
ఆపై క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆచితూచి ఆడాడు. నాథన్ లైయాన్ బౌలింగ్‌లో ఆదిలోనే టీమ్ పైన్ ఓ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన పంత్.. నెమ్మదిగా గేర్ మార్చాడు. లైయాన్‌ను టార్గెట్‌గా ఆడాడు. అతడి బౌలింగ్‌లోనే ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే అద్భుత హాఫ్ సెంచరీ చేశాడు. హాఫ్ సెంచరీ అనంతరం పైన్ మరోసారి క్యాచ్ వదిలేశాడు. ఆపై బౌండరీలు బాదుతూ.. భారత్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మరోవైపు చేటేశ్వర్ పుజారా అతనికి మంచి సహకారం అందిస్తున్నాడు.
ప్రస్తుతం 70 ఓవర్లు ముగిసేసరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. చేటేశ్వర్ పుజారా (41), రిషబ్ పంత్ (73) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, హాజిల్ వుడ్, లైయాన్ తలో వికెట్ తీశారు. భారత్ విజయం సాధించాలంటే. ఇంకా 201 పరుగులు చేయాలి. రెండో సెషన్ ఈ జోడి బాగా ఆడితే.. దాదాపు విజయం సాధించినట్టే.