
సిడ్నీ: ఆస్ట్రేలియా నిర్దేశించిన 407 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియాకు భారీ షాక్ తగిలింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తొలి వికెట్ రూపంలో ఔట్ అయ్యాడు. ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ వేసిన 22.1 ఓవర్‌లో గిల్ (31; 64 బంతుల్లో 4x4) ఔటయ్యాడు. బంతి ఎడ్జ్ తీసుకొని కీపర్ టీమ్ పైన్ చేతుల్లో పడడంతో భారత్ 71 పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయింది. గిల్ ఔటయ్యాక టెస్ట్ స్పెషలిస్ట్ చేటేశ్వర్ పుజారా క్రీజులోకి వచ్చాడు.
ఒక వికెట్ పడినా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ (52; 98 బంతుల్లో 5x4, 1x6) నిలకడగా ఆడాడు. చేటేశ్వర్ పుజారాతో కలిసి చాలా ఏకాగ్రతతో ఆడాడు. ఈ క్రమంలోనే నాథన్ లైయన్ వేసిన 30వ ఓవర్ నాలుగో బంతికి సింగల్ తీసి అర్ధ సెంచరీ చేశాడు. ఓవర్సీస్‌లో ఓపెనర్‌గా తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న రోహిత్ అర్ధ సెంచరీ చేయడం విశేషం. అయితే ఆ తర్వాతి ఓవర్లోనే రోహిత్ ఔట్ అయ్యాడు. పాట్ కమిన్స్ వేసిన 31వ ఓవర్ రెండో బంతికి మిచెల్ స్టార్క్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియాకు భారీ షాక్ తగిలింది.
ప్రస్తుతం క్రీజులో చేటేశ్వర్ పుజారా (9), అజింక్య రహానే (4) ఉన్నారు. భారత్ 32 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. నాలుగో రోజు ముగియడానికి ఇంకా 8 ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఇక భారత్ విజయానికి ఇంకా 312 రన్స్ అవసరం. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. ఒకవేళ డ్రా చేసుకోవాలన్నా.. ఇంకో రోజు మొత్తం పోరాడాల్సి ఉంది. పుజారా, రహానేపైనే భారత్ విజయం ఆధారపడి ఉంది.
అంతకముందు ఆస్ట్రేలియా జట్టు 312 పరుగులకు డిక్లేర్ చేసింది. డేవిడ్ వార్నర్ (13), విల్ పకోవ్‌స్కీ ( 10) వెంటవెంటనే ఔటయినప్పటికీ.. స్టీవ్ స్మిత్ ( 81), మార్నస్ లబుషేన్ (73) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియాని పటిష్ట స్థితిలో నిలిపారు. చివరలో ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ (84), కెప్టెన్ టిమ్ పైన్ (39) బౌండరీలతో రెచ్చిపోయారు. దీంతో స్కోర్ బోర్డ్ వేగంగా పరుగెత్తింది.