
బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్ మరో మ్యాచ్ ఓడింది. పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన టోర్నీ ఆరో మ్యాచులో సిడ్నీ చిత్తయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పెర్త్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆ జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు ఆడమ్ లిత్ (4), ఫాఫ్ డు ప్లెసిస్ (14) ఇద్దరూ విఫలమయ్యారు. ఆ తర్వాత వచ్చిన నిక్ హాబ్సన్ (8), జోష్ ఇంగ్లిస్ (13), కెప్టెన్ ఆష్టన్ టర్నర్ (2) కూడా రాణించలేదు. ఇలాంటి సమయంలో ఆరోన్ హార్డీ (32 బంతుల్లో 55) ఆ జట్టును ఆదుకున్నాడు. అతనికి ఆష్టన్ అగర్ (24) నుంచి మంచి సహకారం అందింది. వీళ్లిద్దరూ అవుటైన తర్వాత జై రిచర్డ్‌సన్ (6), మాథ్యూ కెల్లీ (13 నాటౌట్), ఆండ్రూ టై (6), జేసన్ బెహ్రెండాఫ్ (5 నాటౌట్) పరుగులు చేశారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనలో సిడ్నీ సిక్సర్స్‌కు కూడా శుభారంభం దక్కలేదు. ఆరంభంలో బెహ్రెండాఫ్, రిచర్డ్‌సన్ నిప్పులు చెరగడంతో ఆ జట్టు బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరుగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓపెనర్లు కర్టిస్ పాటర్సన్ (3), జోష్ ఫిలిప్ (6), జేమ్స్ విన్స్ (9), కెప్టెన్ మోజెస్ హెన్రిక్స్ (0) ఎవరూ రాణించలేదు. కాసేపు ఆశలు రేపిన జోర్డాన్ సిల్క్ (41)ను మాథ్యూ కెల్లీ పెవిలియన్ చేర్చాడు. డాన్ క్రిస్టియన్ (1) విఫలమవగా.. హేడన్ కెర్ (42) రాణించాడు. కానీ పరుగులు వేగంగా చేయాల్సి రావడంతో ఒత్తిడికి గురైన అతను రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత అదే దూకుడు ప్రదర్శించిన రిచర్డ్‌సన్ లోయర్ ఆర్డర్ పనిపట్టాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో సిడ్నీ సిక్సర్స్ జట్టు 117 పరుగులకు ఆలౌట్ అయింది. ఇది ఈ లీగ్‌లో సిడ్నీకి వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం.