త్వరలోనే టీమిండయి మూడు టీ20ల సిరీస్ కోసం ఐర్లాండ్ వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ సిరీసులో భారత జట్టు పగ్గాలను సూర్యకుమార్ యాదవ్‌కు అప్పగించాలని బీసీసీఐ అనుకుంటోందట. గతేడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్‌లో టీమిండియాకు హార్దిక్ పాండ్యానే కెప్టెన్సీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఐర్లాండ్ సిరీసులో అతనికి కూడా విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది.
ఆగస్టు నెలలో జరిగే ఈ టీ20 సిరీసులో సీనియర్ ప్లేయర్లు ఎవరూ ఆడటం లేదన్న సంగతి తెలిసిందే. రోహిత్, కోహ్లీ వంటి వారు గత టీ20 వరల్డ్ కప్ తర్వాత మళ్లీ పొట్టి ఫార్మాట్‌లో భారత్ తరఫున ఆడింది లేదు. ఈసారి పాండ్యా కూడా ఐర్లాండ్ సిరీస్ ఆడేలా లేడు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ తర్వాత జరిగే వన్డే, టీ20 సిరీసులో పాండ్యా ఆడతాడు. వాటి తర్వాత పాండ్యా అభిప్రాయం తీసుకుంటామని, ఆ తర్వాతనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ ఇప్పటికే చెప్పేసింది.

ఐర్లాండ్ సిరీస్ ముగిసిన వెంటనే ఆసియా కప్ ఉంది. ఇది జట్టుకు కీలకమైన సిరీస్. ఆ తర్వాత జరిగే వరల్డ్ కప్ ఎంత ముఖ్యమో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు సిరీసుల్లో రోహిత్ డిప్యూటీగా హార్దిక్ వ్యవహరించనున్నాడు. అతని సేవలు భారత జట్టుకు చాలా కీలకం కూడా. అందుకే వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా హార్దిక్‌కు ఐర్లాండ్ సిరీసులో విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
అంతేకాదు, యువ సంచలనం రింకూ సింగ్, తిలక్ వర్మ వంటి వారిని కూడా ఐర్లాండ్‌పై ఆడించాలని బీసీసీఐ అంటోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో వీళ్లు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. టీ20ల్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సూర్యను ఈ ఫార్మాట్‌లో కెప్టెన్ చేయాలని చాలా కాలంగా పలువురు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.