మరో మ్యాచ్ మిగిలుండగానే బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. ఢిల్లీ వేదికగా బుధవారం జరిగిన రెండో టీ20లో ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటి 86 పరుగుల పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. పరుగుల పరంగా బంగ్లాదేశ్‌పై భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. ఇక మూడు టీ20ల సిరీస్‌లో మిగిలిన నామమాత్రపు ఆఖరి మ్యాచ్ హైదరాబాద్ వేదికగా శనివారం జరగనుంది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 221 పరుగుల భారీస్కోర్ చేసింది. నితీశ్ కుమార్ రెడ్డి(74; 34 బంతుల్లో, 4 ఫోర్లు, 7 సిక్సర్లు), రింకూ సింగ్(53; 29 బంతుల్లో, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర అర్ధశతకాలతో విరుచుకుపడ్డారు. హార్దిక్ పాండ్య (32; 19 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొస్సేన్ మూడు, తస్కిన్ అహ్మద్, తంజీమ్ హసన్, ముస్తాఫిజుర్ తలో రెండు వికెట్లు తీశారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 135 పరుగులకే పరిమితమైంది. మహ్మదుల్లా(41; 39 బంతుల్లో, 3 సిక్సర్లు) మినహా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, నితీశ్ రెడ్డి చెరో రెండు వికెట్లు, అర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ తలో వికెట్ తీసారు.
అయితే మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. విజయంలో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించాడని అన్నాడు. మ్యాచ్ జరిగిన రోజు నితీశ్‌ది అని పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్యకు బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వకపోవడానికి కారణాన్ని వివరించాడు. 41/3తో కష్టాల్లో ఉన్నజట్టును నితీశ్-రింకూ ఆదుకున్న తీరును సూర్య కొనియాడాడు.
''ఇలాంటి పరిస్థితిని (41/3) మిడిలార్డర్ బ్యాటర్లు సమర్థవంతంగా చక్కదిద్దారు. రింకూ, నితీశ్ విషయంలో సంతోషంగా ఉన్నాను. నేను ఎలా కోరుకున్నానో సరిగ్గా అలానే ఆడారు. జెర్సీలు, ఫ్రాంచైజీలు మాత్రమే మారాయి. కానీ మిగిలిన అంతా సేమ్, స్వేచ్ఛగా ఆడారు. ఇక భిన్న పరిస్థితుల్లో బౌలర్లను పరీక్షించాలనుకున్నాను. అందుకే హార్దిక్‌కు బౌలింగ్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు. కొన్నిసార్లు సుందర్ బౌలింగ్ చేసే అవకాశం రాకపోవచ్చు. కానీ స్టోర్‌లో చాలా బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక ఇది నితీశ్ రోజు. అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలనుకున్నాను'' అని సూర్యకుమార్ పేర్కొన్నాడు.