
సిడ్నీ: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకుల జాబితాలో కొన్ని ఆశ్చర్యకరమైన పేర్లు కనిపించాయి. ఊహించినట్టే టీమిండియా మాజీ కేప్టెన్ విరాట్ కోహ్లీ తన స్థానాన్ని మెరుగుపర్చుకున్నాడు. టాప్ 10లో చోటు సంపాదించుకున్నాడు. పాకిస్తాన్‌తో మెల్‌బోర్న్‌లో జరగిన మ్యాచ్ అనంతరం కోహ్లీ ర్యాంకింగ్ నంబర్ రాకెట్లా దూసుకొచ్చింది. రెండు నెలల కిందట 35వ స్థానంలో ఉన్న అతను తాజాగా 9వ స్థానానికి ఎగబాకాడు.
అదే సమయంలో- టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన స్థానాన్ని కోల్పోయాడు. ఇప్పటివరకు ఐసీసీ టీ20 ఇంటర్నేషనల్స్ ర్యాంకింగ్‌లో అతని రెండు. అక్కడి నుంచి దిగజారాడు. 3వ స్థానానికి పడిపోయాడు. టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో అతను తన స్థాయికి తగ్గట్టుగా ఆడకపోవడమే దీనికి కారణం. పాకిస్తాన్‌పై మ్యాచ్‌లో భారీ స్కోర్ చేయడంలో విఫలం అయ్యాడు.
10 బంతుల్లో రెండు ఫోర్లతో 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు. హ్యారిస్ రవూఫ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు సూర్యకుమార్ యాదవ్. భారీ ఇన్నింగ్ ఏదీ కూడా అతని బ్యాట్ నుంచి జాలువారకపోవడం వల్ల ర్యాంకింగ్‌ను కోల్పోవాల్సి వచ్చింది. అదే సమయంలో న్యూజిలాండ్ డాషింగ్ ఓపెనర్ డెవాన్ కాన్వే- రెండో స్థానానికి ఎగబాకాడు. సూర్యకుమార్ యాదవ్ స్థానాన్ని ఆక్రమించుకున్నాడు.
ఆస్ట్రేలియాపై జరిగిన ఓపెనర్ మ్యాచ్‌లో కాన్వే చెలరేగిన విషయం తెలిసింద. 58 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 92 పరుగులు చేస, నాటౌట్‌గా నిలిచాడు. ఇది అతనికి కలిసొచ్చింది. దీనితో ఐసీసీ టీ20 ఇంటర్నేషనల్స్ ర్యాంకింగ్స్ జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. పాకిస్తాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. రెండో స్థానంలో డెవాన్ కాన్వే, మూడులో సూర్యకుమార్ యాదవ్, నాలుగో స్థానంలో పాకిస్తాన్ కేప్టెన్ బాబర్ ఆజమ్ నిలిచారు.
దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాటర్ ఎయిడెన్ మార్క్‌రమ్ 762 పాయింట్లతో అయిదో స్థానంలో ఉన్నాడు. ఆ తరువాత వరుసగా ఇంగ్లాండ్ ఓపెనర్ డేవిడ్ మలన్, ఆస్ట్రేలియా కేప్టెన్ ఆరోన్ ఫించ్, శ్రీలంక ఓపెనర్ పాథుమ్ నిశ్శంక, టీమిండియా బ్యాటింగ్ బ్యాక్‌బోన్ విరాట్ కోహ్లీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బ్యాటర్ మహమ్మద్ వసీం నిలిచారు. కోహ్లీ వద్ద ఉన్న పాయింట్ల సంఖ్య 635.