
ఐసీసీ ఈ ఏడాదికి 'టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' అవార్డుకు నామినేషన్లను ప్రకటించింది. ఈ అవార్డు కోసం నలుగురు ఆటగాళ్ల మధ్య పోటీ ఉన్నట్లు ఐసీసీ వెల్లడించింది. ఈ రేసులో భారత్ నుంచి ప్రపంచ నెంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా పోటీలో ఉన్నాడు. అతనికే ఈ అవార్డు దక్కుతుందని అభిమానులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. అతనితో పోలిస్తే మిగతా వాళ్లు అంత గొప్పగా ఏం సాధించలేదని వాదిస్తున్నారు.
ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో 2022 సంవత్సరానికి గానూ 'ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును అందించాలని నిర్ణయించింది. ఈ అవార్డు కోసం టీమిండియా టీ20 స్పెషలిస్టు సూర్యకుమార్ యాదవ్, ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ శామ్ కర్రాన్, పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్, జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా పోటీ పడుతున్నారు. వీరిలో సూర్యకుమార్ యాదవ్ ఏడాది మొత్తం సూపర్ ఫామ్ కొనసాగించిన సంగతి తెలిసిందే.

శామ్ కర్రాన్ ఏడాది ఆరంభంలో పెద్దగా పొట్టి ఫార్మాట్ ఆడలేదు. అయితే టీ20 వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణించాడు. ఈ మెగా టోర్నీలో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డుతోపాటు ఫైనల్ మ్యాచ్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు కూడా అందుకున్నాడు. దీంతో ఐసీసీ అవార్డు రేసులో సూర్యకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇక మహమ్మద్ రిజ్వాన్ సంగతి చూస్తే.. అతను టీ20ల్లో పెద్దగా ఆకట్టుకోలేదు. నెమ్మదైన ఆటతీరుతో అభిమానుల నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. క్రీజులో కుదురుకోవడంపై ఎక్కువగా ఫోకస్ పెట్టిన అతను.. మ్యాచులు గెలిపించడంలో విఫలమయ్యాడు.
సికందర్ రజా ఈ ఏడాది జింబాబ్వే తరఫున అద్భుతంగా ఆడాడు. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అటు బ్యాటుతో, ఇటు బంతితో ఆకట్టుకున్నాడు. పాకిస్తాన్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచులో బ్యాటుతో రాణించకపోయినా.. బంతితో మూడు కీలక వికెట్లు తీసుకొని జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో అతను కూడా 'ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు రేసులో నిలిచాడు.