ఏమైంది సామీ నీకు.. లోకల్ లీగ్‌లోనూ తుస్సే..!
భారత టీ20 జట్టు కెప్టెన్, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కెరీర్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో పడినట్లు కనిపిస్తోంది. గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న సూర్య.. ఐపీఎల్ 2026 నిరాశాజనక ప్రదర్శన తర్వాత ఇప్పుడు స్థానిక లీగ్‌లో కూడా రాణించలేక చేతులెత్తేశాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రారంభమైన ముంబై టీ20 లీగ్ సీజన్ 4 తొలి మ్యాచ్‌లోనే సూర్యకుమార్ యాదవ్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ లీగ్‌లో ట్రయంఫ్ నైట్స్ ఎంఎన్ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సూర్యకుమార్ యాదవ్.. నార్త్ ముంబై పాంథర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 19 పరుగులు మాత్రమే చేసి ఓ అనామక బౌలర్ చేతిలో ఔట్ కావడం చర్చనీయాంశంగా మారింది.
ఈ మ్యాచ్‌లో నార్త్ ముంబై పాంథర్స్ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చి కాస్త వేగంగానే ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ.. దానిని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. యువ బ్యాటర్ నూతన్ గోయల్(93 పరుగులు)తో కలిసి మూడో వికెట్ కు 37 పరుగుల పార్టనర్‌షిప్ నెలకొల్పి ఫామ్‌లోకి వస్తున్నట్లు కనిపించిన సూర్యకుమార్ యాదవ్.. స్పిన్నర్ రాహుల్ సావంత్ వేసిన 7వ ఓవర్లో డీప్ స్క్వేర్ లెగ్ వద్ద క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. సూర్యకుమార్ యాదవ్ ఔటైన తర్వాత ట్రయంఫ్ నైట్స్ మిడిలార్డర్ కుప్పకూలడంతో నిర్ణీత ఓవర్ల 8 వికెట్లకు 188 పరుగులు మాత్రమే చేసి 21 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది.

వాస్తవానికి సూర్యకుమార్ యాదవ్‌కు గత కొంతకాలంగా బ్యాటింగ్‌లో అస్సలు కలిసిరావడం లేదు. ఈ ఏడాది మార్చలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడినప్పటికీ.. వ్యక్తిగతంగా సూర్య ఆటతీరు సాధారణంగానే ఉంది. ఆ టోర్నీలో ఆడిన 9 మ్యాచ్‌ల్లో 30.25 సగటుతో 242 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ 2026లో కూడా సూర్య ఫ్లాప్ షో కొనసాగింది. ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన 13 మ్యాచ్‌ల్లో కేవలం 20.76 సగటుతో 260 పరుగులు మాత్రమే చేశాడు. సూర్యకుమార్ యాదవ్ వైఫల్యం కారణంగానే ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
ఈ వరుస వైఫల్యాల నేపథ్యంలో సెలెక్టర్ల భవిష్యత్తు ప్రణాళికల్లో సూర్యకుమార్ యాదవ్ స్థానంపై నీలినీడలు కమ్ముకున్నాయి. 2028 ఒలింపిక్ క్రీడలు, తదుపరి టీ20 ప్రపంచకప్ కోసం యువ ఆటగాళ్లను సిద్ధం చేయాలనే యోచనలో ఉన్న సెలెక్టర్లు.. సూర్యను పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే త్వరలో జరగబోయే ఆసియా క్రీడల భారత జట్టు నుంచి సూర్యను తప్పించడం ఆయనకు పెద్ద షాక్‌గా మారింది. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ ముందు తన ఫామ్‌ను, కెప్టెన్సీని నిరూపించుకోవడానికి ఐర్లాండ్ పర్యటన ఒక్కటే చివరి అవకాశంగా కనిపిస్తోంది. ఈ నెల 26, 28 తేదీల్లో బెల్‌ఫాస్ట్‌లో ఐర్లాండ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సూర్య కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్‌లోనైనా సూర్య ఫామ్‌లోకి వస్తాడో లేదో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications