
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు సిద్ధమవుతున్న టీమిండియా యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ తన మంచి మనసును చాటుకున్నాడు. ఓ స్థానిక టోర్నమెంట్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న సూర్యకుమార్.. దానిని గ్రౌండ్స్‌మెన్‌కు విరాళంగా ఇచ్చాడు. అంతేకాకుండా ఈ సందర్భంగా గ్రౌండ్స్‌మెన్ సేవలను సూర్యకుమార్ కొనియాడాడు. దీంతో సూర్యపై క్రికెట్ ప్రముఖులతోపాటు అభిమానులు ప్రశంసలు కురిపించారు.
ముంబైలోని స్థానిక టోర్నమెంట్‌లో పాల్గొన్న సూర్యకుమార్ యాదవ్ పార్సీ జింఖానా జట్టు తరఫున బరిలోకి దిగాడు. ఈ సందర్భంగా పయ్యాడే స్పోర్ట్స్ క్లబ్ జట్టుపై విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో 152 బంతుల్లోనే 249 పరుగులు బాదేశాడు. దీంతో ఆ మ్యాచ్‌లో పయ్యాడే స్పోర్స్ట్ క్లబ్ జట్టుపై పార్సీ జింఖానా జట్టు విజయం సాధించింది. డబుల్ సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్ యాదవ్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. అయితే తనకు వచ్చిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ను సూర్యకుమార్ సదరు మ్యాచ్‌కు పిచ్ సిద్ధం చేసిన గ్రౌండ్స్‌మెన్‌కు విరాళంగా ఇచ్చాడు. ఈ సందర్భంగా గ్రౌండ్స్‌మెన్‌పై సూర్య ప్రశంసలు కురిపించాడు.
పిచ్ సిద్ధం చేయడానికి గ్రౌండ్స్‌మెన్ చాలా కష్టపడతారని చెప్పుకొచ్చాడు. గ్రౌండ్‌మెన్స్ అందరి కంటే ముందే గ్రౌండ్‌కు వచ్చి పిచ్‌ను ఏర్పాటు చేయడంతోపాటు అన్ని ఏర్పాట్లు చేస్తారని అన్నాడు. తాను క్రికెట్ ఆడడం ప్రారంభించినప్పుడు ఉదయాన్నే గ్రౌండ్‌కు వచ్చి ప్రాక్టీస్ చేసేవాడినని, ఆ సమయంలో తన స్నేహితులతో కలిసి పిచ్‌ను మొత్తం కలియ తిరిగేవాడినని చెప్పాడు. ఆ సమయంలో గ్రౌండ్స్‌మెన్ చేసే శ్రమను చూసేవాడినని చెప్పాడు. అయితే అంత చేసిన వారికి సరైన గుర్తింపు ఉండదని సూర్య ఆవేదన వ్యక్తం చేశాడు. చాలా మంది క్రికెటర్లు గ్రౌండ్స్‌మెన్ చేసిన కృషిని మరిచి పోతారని, కానీ తాను అలా కాదని, వారితో తనకున్న బంధం అలాంటిది కాదని తెలిపాడు. క్రికెటర్లంతా గ్రౌండ్స్‌మెన్ సేవలను గుర్తించాలని సూచించాడు.
తాము బాగా ఆడినప్పుడు అందరూ తమను మెచ్చుకుంటారని, పేపర్లలో కూడా తమ గూరించి ఇస్తారని అన్నాడు. కానీ గ్రౌండ్స్‌మెన్‌ను ఎవరూ గుర్తించరని తెలిపాడు. ఓ ఆటగాడు మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు, మంచి పిచ్‌ను సిద్ధం చేసి గ్రౌండ్స్‌మెన్ పరోక్షంగా సహకరిస్తారని చెప్పాడు. నిజానికి వారు ఆ క్రెడిట్‌కు అర్హులు అని అన్నాడు. ఈ సందర్భంగా గ్రౌండ్స్‌మెన్‌కు కృతజ్ఞతలు చెప్పిన సూర్య.. ఆటగాళ్లంతా గ్రౌండ్స్‌మెన్ సేవలను గుర్తించాలని కోరాడు.