రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండో టీ20లో 37 బంతుల్లోనే 82 పరుగులు చేసి భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. దాదాపు 468 రోజుల తర్వాత టీ20ల్లో అర్థ శతకం సాధించిన సూర్య కుమార్ యాదవ్.. తన ఫామ్‌పై వస్తున్న విమర్శలకు గట్టి సమాధానమిచ్చాడు. అయితే ఈ ఘనత సాధించిన తర్వాత సూర్య తన భార్య దేవిషా శెట్టి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బీసీసీఐ షేర్ చేసిన ఓ వీడియోలో ఇషాన్ కిషన్‌తో మాట్లాడుతూ సూర్యకుమార్ యాదవ్ ఇలా అన్నాడు. "మనం ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కోచ్ కూర్చుని ఉంటారు. ఆ కోచ్ మరెవరో కాదు.. మనం పెళ్లి చేసుకున్న వ్యక్తి (భార్య). నా ఆటను ఆమె చాలా దగ్గర నుండి గమనిస్తుంది. నా మనసులో ఏం నడుస్తుందో ఆమెకు బాగా తెలుసు." అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
"నువ్వు క్రీజులోకి వెళ్లిన తర్వాత కొంచెం సమయం తీసుకో.. తొందరపడకు అని దేవిషా నాకు ఎప్పుడూ చెబుతుంటుంది. ఆ సలహాను నేను పాటించాను. గత మ్యాచ్‌లోనూ, ఈ మ్యాచ్‌లోనూ నేను క్రీజులో సెటిల్ అవ్వడానికి సమయం తీసుకున్నాను. ఫలితం మీ ముందే ఉంది" అని సూర్య వివరించాడు.

తన ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సమయంలో తాను అనుసరించిన వ్యూహాలను కూడా సూర్య పంచుకున్నాడు. "2-3 రోజులు ఇంట్లోనే ఉండి ప్రశాంతంగా గడిపాను. సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉన్నాను. గత మూడు వారాలుగా నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాను." అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
రికార్డు ఇన్నింగ్స్
ఈ మ్యాచ్‌లో భారత్ 1.1 ఓవర్లలోనే 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు సూర్య కుమార్ యాదవ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 9 ఫోర్లు, 4 సిక్సర్లతో కివీస్ బౌలర్లను చీల్చి చెండాడాడు. 210 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 15.2 ఓవర్లలోనే భారత్ ఛేదించడంలో సూర్య కీలక పాత్ర పోషించాడు.