
శ్రీలంకతో తొలి వన్డే ఆడేందుకు టీమిండియా రెడీ అయింది. గువాహటి వేదికగా జరగుతున్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక టాస్ గెలిచాడు. తాము ముందుగా బౌలింగ్ చేస్తామని వెల్లడించాడు. దీనిపై స్పందించిన రోహిత్ శర్మ తాము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనే అనుకున్నామని చెప్పాడు. సోమవారం నాడు ప్రాక్టీస్ సమయంలోనే ఇక్కడ మంచు ప్రభావం ఉన్నట్లు తమకు అర్థమైందని, అందుకే ముందుగా బౌలింగ్ చేయాలని అనుకున్నానని చెప్పాడు.
లంక జట్టు బౌలింగ్ ఎంచుకోవడంతో ఆ అవకాశం లేదన్న రోహిత్.. ఇది తమకు కచ్చితంగా ఒక సవాల్ అని పేర్కొన్నాడు. అదే సమయంలో వన్డే వరల్డ్ కప్ కూడా భారత్‌లోనే జరగనున్న నేపథ్యంలో మంచు వంటి అంశాలకు కూడా జట్టు అలవాటు పడితే బెటర్ అని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో ఆడే జట్టులో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు చోటు దక్కలేదు. టాస్ సమయంలో జట్టును ప్రకటించిన రోహిత్.. జట్టులో సూర్య లేని విషయాన్ని వెల్లడించాడు.
చివరగా న్యూజిల్యాండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడిన సూర్యకుమార్ పెద్దగా ఆకట్టుకోలేదు. టీ20ల్లో రాణిస్తున్నప్పటికీ అతని వన్డే ఫామ్ అంత గొప్పగా లేదు. ఈ క్రమంలోనే అతన్ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఫామ్ లేక తంటాలు పడుతున్న కేఎల్ రాహుల్‌కు మరో అవకాశం ఇవ్వాలని టీం మేనేజ్‌మెంట్ భావించింది. రోహిత్, గిల్ ఓపెనర్లుగా బరిలో దిగుతున్నారు. శ్రీలంక జట్టులో కూడా ఒక మార్పు చేసినట్లు దాసున్ షనక తెలిపాడు. మహీష్ తీక్షణ ఆడటం లేదని వెల్లడించాడు. అతని స్థానంలో దునిత్ వెల్లెలిగా ఆడుతున్నట్లు చెప్పాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్