దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో గాయపడిన స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకు దూరమైన సంగతి తెలిసిందే. ఆఖరి టీ20లో ఫీల్డింగ్ చేస్తుండగా సూర్య కాలిమడమకు గాయమైంది.ప్రస్తుతం అతడు బాగానే కోలుకుంటున్నాడు. అయితే సూర్యకుమార్ ఐసీసీ అవార్డుపై కన్నేశాడు. టీ20ల్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ అయిన సూర్య.. 2023లో టీ20 మేటి ఆటగాళ్ల షార్ట్ లిస్టుకు ఎంపికయ్యాడు.
టీ20ల్లో ఉత్తమంగా రాణించే ప్లేయర్లకు ఐసీసీ 2021 నుంచి 'మెన్స్ టీ20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్' అవార్డు అందిస్తుంది. ఈ నేపథ్యంలో 2023 ఏడాదికి గానూ నలుగురు ప్లేయర్లను ఐసీసీ షార్ట్ లిస్ట్ చేసింది. సూర్య కుమార్‌తో పాటు సికందర్ రజా (జింబాబ్వే), అల్పేష్ రమ్‌జాని (ఉగాండా), మార్క్ చాప్‌మన్ (న్యూజిలాండ్) అవార్డు కోసం పోటీపడుతున్నారు.

2023లో సూర్యకుమార్ 17 ఇన్నింగ్స్‌లో 48 సగటుతో, 155 స్ట్రైక్ రేటుతో 733 పరుగులు చేశాడు. దీనిలో రెండు సెంచరీలు ఉన్నాయి. జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా కూడా సత్తాచాటాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 515 పరుగులతో పాటు 17 వికెట్లు తీశాడు. ఉగాండా బౌలర్ అల్పేష్ గతేడాది 55 వికెట్లు తీశాడు. అలాగే కివీస్ బ్యాటర్ మార్క్ చాప్‌మన్ 19 ఇన్నింగ్స్‌ల్లో 576 పరుగులు సాధించాడు.
కాగా, 2023 ఏడాదికి గానూ సూర్య ఈ అవార్డుకు ఎంపికైతే చరిత్ర సృష్టిస్తాడు. మెన్స్ టీ20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును వరుసగా అందుకున్న ప్లేయర్‌గా, అత్యధిక సార్లు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. 2021లో పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్, 2022లో సూర్యకుమార్ యాదవ్ ఈ అవార్డు అందుకున్నారు.
అలాగే ఐసీసీ మెన్స్ ఎమెర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ పోటీపడుతున్నాడు. ఈ ఉత్తమ వర్ధమాన క్రికెటర్ అవార్డు కోసం జైస్వాల్‌తో పాటు రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్), కొయెట్జీ (దక్షిణాఫ్రికా), మదుశంక (శ్రీలంక) కూడా షార్ట్ లిస్ట్‌కు ఎంపికయ్యారు. రచిన్ ఆల్‌రౌండర్ కాగా, కొయెట్జీ, మదుశంక ఫాస్ట్ బౌలర్లు.