
సన్‌రైజర్స్‌లోకి రైనా
టీమిండియా మాజీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ సురేష్ రైనా ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ తరఫున ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు రైనాను వేలంలో కొనుగోలు చేయాలని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ భావిస్తోందట. ఈ వార్తలు నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నప్పటికీ ఇదే నిజమని తెలుస్తోంది. ఐపీఎల్‌లో విజయవంతమైన బ్యాటర్లలో సురేష్ రైనా ఒకడు. అలాంటి బ్యాటర్ టీంలో ఉంటే సరైన భారత ఆటగాడు జట్టులో లేని లోటు తీరుతుందని రైజర్స్ యాజమాన్యం భావిస్తోందని సమాచారం.

రిటెన్షన్ జాబితాలో రైనాకు నో ప్లేస్
ఇప్పటివరకు జరిగిన అన్ని ఐపీఎల్ సీజన్లలో సురేష్ రైనా చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. చైన్నై జట్టు లేని రెండు సీజన్లు మాత్రం గుజరాత్ లయన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇంతలా విజయవంతం కావడంలో రైనా కూడా కీలక పాత్ర పోషించాడు. దీనికి తగ్గట్టు ప్రతి ఏడాది రిటెన్షన్ జాబితాలో రైనాకు చోటుదక్కేది. అయితే ఈ సారి ఆశ్చర్యకరంగా సురేష్ రైనాకు సూపర్ కింగ్స్ రిటెన్షన్ జాబితాలో చోటు దక్కలేదు. ఆ జట్టు ఈ సారి జడేజా, ధోని, మొయిన్ అలీ, రుతు రాజ్ గైక్వాడ్‌న్ రిటైన్ చేసుకుంది. అయితే గత సీజన్లో రైనా రాణించకపోవడం కూడా అతనికి రిటెన్షన్ జాబితాలో చోటు దక్కపోవడానికి కారణంగా చెప్పవచ్చు. దీంతో ఈ సారి రైనా మెగా వేలంలో పాల్గొననున్నాడు.

ధర ఎంతంటే?
సురేష్ రైనాకు గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ 11 కోట్ల రూపాయలను చెల్లించింది. అయితే ఈ సారి రైనాకు వేలంలో అంత ధర దక్కడం కష్టమని క్రికెట్ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం 35 ఏళ్ల రైనా భారత జట్టులో లేడు. దీనికి తోడు ఇటీవల కాలంలో రైనా సరైన ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. అయితే సురేష్ రైనా వంటి అనుభవజ్ఞుడైన స్టార్ బ్యాటర్ తమ జట్టులో ఉంటే బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంటుందని సన్‌రైజర్స్ మెనేజ్‌మెంట్ నమ్ముతుందని సమాచారం. దీనికి తోడు ప్రస్తుతం రైనా ఫామ్‌లో లేకపోయినప్పటికీ సరైన సమయంలో రాణిస్తాడని భావిస్తోంది. అందుకే వేలంలో రైనాను ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయాలని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఇందుకుగాను వేలంలో రైనాకు 10 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాలని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ భావిస్తోందని తెలుస్తోంది.

రైనా రికార్డులు
ఐపీఎల్‌లో ఇప్పటివరకు 205 మ్యాచ్‌లు ఆడిన సురేష్ రైనా 32 సగటుతో 5,528 పరుగులు చేశాడు. ఇందులో 39 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. అత్యధిక స్కోర్ 100 పరుగులు. ఈ క్రమంలో 506 ఫోర్లు కొట్టిన సురేష్ రైనా.. 206 సిక్స్‌లు బాదాడు.


Click it and Unblock the Notifications












