IPL 2021: అతని కోసం.. ఈసారి ఐపీఎల్ టైటిల్ కచ్చితంగా గెలుస్తాం: రైనా

హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, సురేష్ రైనాల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత జట్టుకు చాలా కాలంగా ఆడిన నేపథ్యంలో ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వీరి మధ్య సోదర బంధం మరింత బలపడింది. అందుకే మహీ వీడ్కోలు పలకగానే.. రైనా సైతం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఇక మహీ అంటే ఎంతో గౌరవమని పలు సందర్భాల్లో చెప్పడమే గాక.. చేతల్లోను చూపించాడు. తాజాగా రైనా ఓ స్పోర్ట్స్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో మరోసారి వారి బంధానికి సంబంధించి విషయాలను పంచుకున్నాడు.

సోదరుడిలా భావించేవాడిని:
తాజాగా సురేష్ రైనా మాట్లాడుతూ... 'మేం భారత్, చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఎన్నో మ్యాచ్‌లు కలిసి ఆడాం. ఆటగాడిగా మహీ అంటే నాకు ఎంతో గౌరవం ఉంది, అలానే వ్యక్తిగతంగా అతనంటే నాకిష్టం కూడా. నేను అతని నుంచి చాలా నేర్చుకున్నా. ధోనీని నా సహచరుడిలా కాకుండా ఓ సోదరుడిలా భావించేవాడిని' అని అన్నాడు. గత సీజన్ వైఫల్యాలను పునరావృతం కాకుండా ఐపీఎల్ 2021లో మా జట్టు మంచి ప్రదర్శనే కనబరుస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు. తమ జట్టుకు ప్రధాన బలంగా చెప్పుకోదగిన వాటిలో మహీ కెప్టెన్సీ ఒకటని చిన్న తలా చెప్పుకొచ్చాడు.

ధోనీ కోసం టైటిల్ గెలుస్తాం:
'ఐపీఎల్ 2021 కోసం దుబాయ్ వెళ్లగానే మాకోసం శిబిరం ఏర్పాటవుతుంది. ఈ సీజన్లో మా ఆటతీరు, మహీ సారథ్యం వల్ల అదనపు ఆత్మవిశ్వాసం లభించింది. మేమందరం మా విజయాలను ఆస్వాదిస్తున్నాం. మహీ అందరికీ స్వేచ్ఛనిస్తాడు. దీంతో ఆటగాళ్లలో అత్యుత్తమ ఆటతీరు బయటకు వస్తుంది. మా జట్టులో మొయిన్ అలీ, సామ్ కరన్, డ్వేన్ బ్రావో, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నారు. మేం జోరుమీదున్నాం. ధోనీ కోసం ఈసారి టైటిల్ గెలుస్తామనే ధీమా ఉంది. అదే జరిగితే మరో రెండు మూడేళ్లు మహీ లీగులో కొనసాగేందుకు అవకాశం ఉంటుంది' అని సురేష్ రైనా తెలిపాడు. ఈ సీజన్ గడిచాక ధోనీ ఆడకపోవచ్చన్న వార్తలు వినిపిస్తున్నా.. వాటిని సీఎస్‌కే, రైనా కొట్టిపారేయడం గమనార్హం.

ఆ రోజు మహీ భాయ్ దొరికాడు:
2018లో ఐర్లాండ్ వెళ్లినప్పుడు ఓ సరదా సంఘటన జరిగిందని సురేష్ రైనా చెప్పాడు. 'ఆ మ్యాచులో ధోనీ భాయ్ శీతల పానీయాలు అందించాడు. నేను ప్రతిసారీ గ్లోవ్స్, బ్యాట్ల కోసం పిలుస్తుండటంతో.. అతడు నా కిట్ బ్యాగ్ మొత్తం మోసుకొచ్చాడు. 'ఏం కావాలో తీసుకో. మళ్లీ మళ్లీ పిలవకు. ఇక్కడ చలిగా ఉంది' అని అన్నాడు. 'అయితే ఓ పనిచేయి. నా హ్యాండ్ గ్రిప్ తీసుకుకొని రా' అని చెప్పాను. 'భలే మంచోడివే దొరికావు. ముందు నీళ్లు తాగు. తీసుకొస్తా' అని మహీ వెళ్లాడు. ఈ రోజు మహీ భాయ్ నాకు దొరికాడు అని సంతోషించా' అని సురేష్ రైనా చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications