
హైదరాబాద్: టీమిండియా సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనాకు సర్జరీ జరిగింది. గత కొన్ని నెలలుగా మోకాలి సమస్యతో బాధపడుతున్న సురేశ్ రైనా అమస్టర్‌డ్యామ్‌లో మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోని బీసీసీఐ తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. రైనా త్వరగా కోరుకోవాలని ఆకాంక్షించింది.
32 ఏళ్ల సురేశ్ రైనా గత సీజన్ నుంచి మోకాలి నొప్పితో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ నొప్పికి శాశ్వత పరిష్కారం కోసం వైద్యుల సూచన మేరకు అతడు సర్జరీ చేయించుకున్నాడు. రైనాకు చేసిన సర్జరీ సక్సెస్ అయిందని వైద్యులు తెలిపారు.
అతడు కోలుకునేందుకు 4-6 వారాల సమయం పడుతుందని సర్జరీ చేసిన డాక్టర్ హెచ్ వెన డెర్ హోవెన్ వెల్లడించాడు. కాగా, భారత్ తరఫున రైనా 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. భారత్ తరఫున గత ఏడాది జూలైలో చివరిగా వన్డే ఆడిన సురేశ్ రైనా.. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు.
కానీ దేశవాళీ క్రికెట్‌లో రెగ్యులర్‌గా మ్యాచ్‌లు ఆడుతున్న ఈ ఉత్తరప్రదేశ్ ఆటగాడు.. ఈ ఏడాది ముగిసి ఐపీఎల్ 2019 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సత్తాచాటాడు. మూడు హాఫ్ సెంచరీలతో మెరిశాడు.
వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో భాగంగా ఆగస్టు 17 నుంచి దులీప్ ట్రోఫీ ప్రారంభంకానుండగా సర్జరీ కారణంగా ఈ టోర్నీకి సురేశ్ రైనా దూరమయ్యాడు.