
చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా ఈ నెల15న అంతర్జాతీయ క్రికెట్‌కు నిమిషాల వ్యవధిలో వీడ్కోలు పలికి క్రికెట్ ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురిచేశారు. రిటైర్మెంట్ ప్రకటించి మూడురోజులు కావొస్తున్నా.. ఇప్పటికీ ఆ విషయం గురించే చర్చంతా నడుస్తున్నది. భారత్‌కు అపూర్వ విజయాలను అందించిన ఇద్దరిపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. అందరూ వారి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. ఈ క్రమంలో రైనాకు సంబందించిన ఓ వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది.
కిషోర్ కుమార్ క్లాసిక్ సాంగ్స్‌ను ఇష్టపడని సంగీత అభిమానులు ఉండరు. ఒక సందర్భంలో సురేష్ రైనా సైతం ఆయన పాటను ఆలపించి అదరగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోనే తాజాగా బీసీసీఐ ట్వీట్ చేసింది. ఓ హోటల్లో టీమిండియా అల్పాహారం తీసుకుంటుండగా.. రైనా పాట పాడాడు. 1971 చిత్రం 'కటి పతంగ్' సినిమాలోని 'యే షామ్ మస్తానీ' పాటను పాడాడు. ఆ సినిమాలో రాజేష్ ఖన్నా, ఆశా పరేఖ్, ప్రేమ్ చోప్రా నటీనటులు. బీసీసీఐ ట్వీట్ చేసిన వీడియోలో రైనా తనలోని కళలను బయటపెట్టాడు. 'రైనా వాయిస్‌లో కిషోర్ కుమార్ క్లాసిక్‌ని ఆలపించండి' అని కాప్షన్ పెట్టింది. #RainaRetires అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జత చేశారు.
సురేష్ రైనాలో మంచి పాటగాడు దాగున్నాడు. అతడి గొంతు ఎంతో మధురంగా ఉంటుంది. టీమ్‌ఇండియా డ్రస్సింగ్ రూమ్‌లో అతడి పాటలు వినేందుకు ఆటగాళ్లు ఇష్టపడతారు. చెన్నై సూపర్‌కింగ్స్‌లోనూ సందడంతా అతడితోనే ముడిపడి ఉంటుంది. 2015లో విడుదలైన హిందీ క్రైమ్ కామెడీ చిత్రం 'మీరూతియా గ్యాంగ్‌స్టర్స్'లో 'తు మిలి సబ్ మిలా' అనే గీతాన్ని రైనా ఆలపించాడు. లీనమై పాడిన అతడి పాటకు అభిమానులు ఫిదా అయ్యారు. యూట్యూబ్‌లో ఈ గీతాన్ని 28 లక్షలకు పైగా వీక్షించారు. తాజా పాటకు కూడా 8 వేల లైకులు, 900 రీట్వీట్లు వచ్చాయి. రెండు నిమిషాల కన్నా తక్కువ నిడివి ఉన్న ఈ వీడియోలో రైనా అద్భుతంగా పాడాడు.
దశాబ్దకాలం అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగిన సురేష్ రైనా.. 18 టెస్ట్‌లు, 226 వన్డేలు, 78 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. టెస్ట్‌ల్లో 768, వన్డేల్లో 5615, టీ20ల్లో 1605 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఏడు సెంచరీలు నమోదు చేశాడు. ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన రైనా టెస్ట్‌ల్లో 13, వన్డేల్లో 36, టీ20ల్లో 13 వికెట్లు తీశాడు. టీమిండియాకు కీలక విజయాలు అందించిన రైనా వయసు కేవలం 33 సంవత్సరాలే. ఇంకా 5-7 ఏళ్లు క్రికెట్ ఆడే సత్తా అతనిలో ఉంది. కానీ అనూహ్యంగా 33 ఏళ్లకే కెరీర్‌ను ముగించాడు.