
దుబాయ్: స్టార్ ప్లేయర్ సురేశ్ రైనా లేకపోవడం చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్‌కే)కు పెద్ద ఎదురుదెబ్బేనని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత డీన్ జోన్స్ అన్నాడు. రైనా స్థానంలో మరో ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్‌ను భర్తీ చేసుకోవడం ఆ జట్టుకు కష్టమేనని అభిప్రాయపడ్డాడు. అయితే కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ ఆ జట్టుకు అతిపెద్ద బలమని జోన్స్ పేర్కొన్నాడు. రైనా వ్యక్తిగత కారణాలతో లీగ్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.
స్టార్‌స్పోర్ట్స్ షో క్రికెట్ కనెక్టెడ్‌లో డీన్ జోన్స్ మాట్లాడుతూ... 'సురేష్ రైనా లేకపోవడం చెన్నై జట్టుకి భారీ ఎదురుదెబ్బే. ఎందుకంటే.. ఐపీఎల్ పరుగుల వీరుల జాబితాలో టాప్-5లో ఉంటాడు. రైనాది ఎడమచేతి వాటం. అందులోనూ స్పిన్‌ను బాగా ఆడతాడు. సీఎస్‌కేలో ఎక్కువ మంది కుడి చేతి వాటం ఆటగాళ్లే కావడం ఓ బలహీనత. ఆ జట్టుకు ఎడమచేతి వాటం బ్యాటర్లు అవసరం. లేదా ఆ జట్టు ఆటగాళ్లు లెగ్ స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోవాలి. అందుకే సామ్ కరన్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, ఇమ్రాన్ తాహిర్‌ను ఎంచుకోవడం మంచిది' అని సూచించాడు.
'ఎంఎస్ ధోనీ, షేన్ వాట్సన్ బ్యాటింగ్ చేసి చాలా రోజులైంది. సురేష్ రైనా, హర్భజన్ సింగ్ లీగ్ నుంచి తప్పుకున్నారు. జట్టు కూర్పు బాధ్యత ఇక కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, కెప్టెన్ ఎంఎస్ ధోనీపై పడింది. అయితే కెప్టెన్ కూల్ జట్టుకు అతిపెద్ద బలం. ఏదేమైనా అతడెంతో ప్రశాంతంగా ఉంటాడు. ఎదో ఒకటి ఆలోచిస్తాడు. క్వారంటైన్‌లో కుర్రాళ్లకు క్రమశిక్షణ గురించి పాఠాలు చెప్పాడు. ఎందుకంటే అతడు బాధ్యతాయుతంగా ఆడతాడు. అదే వారి నుంచి కోరుకుంటున్నాడు' అని డీన్ జోన్స్ చెప్పాడు.
సెప్టెంబర్ 19న డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్‌కింగ్స్ తలపడనుంది. అయితే వారికి తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ లభించలేదు. జట్టు కూర్పుపై సందిగ్ధం నెలకొంది. ఎందుకంటే కీలకమైన రైనా, హర్భజన్ వ్యక్తిగత కారణాలతో టోర్నీకి దూరమయ్యారు. కరోనా కూడా చెన్నై శిబిరాన్ని ఇబ్బంది పెట్టింది. రైనా స్థానాన్ని భర్తీ చేస్తాడనుకున్న రుత్‌రాజ్ గైక్వాడ్‌కు ఇంకా నెగెటివ్ రాలేదని సమాచారం. రైనా రెగ్యులర్‌గా ఆడే నెం.3లో ఎవరు ఆడతారనే ప్రశ్నతో పాటు హర్భజన్ స్థానాన్ని భర్తీ చేసే బౌలర్ ఎవరు..? అని చెన్నై తర్జనభర్జనలు పడుతోంది. అయితే కెప్టెన్ ధోనీకి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్ని ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలుసని మాజీ క్రికెటర్లు చెప్పుకొస్తున్నారు.