బెంగుళూరు: భారత్, న్యూజిలాండ్ మధ్య ధర్మశాలలో జరిగే తొలి వన్డే మ్యాచ్ నుంచి టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సురైనా తప్పుకున్నాడు. తీవ్ర జ్వరం కారణంగా తొలి వన్డే నుంచి సురేష్ రైనాని తప్పిస్తున్నట్లు బీసీసీఐ గురువారం (అక్టోబర్ 13) అధికారికంగా ప్రకటించింది.
మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో న్యూజిలాండ్‌పై 3-0తో కోహ్లీ సేన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టెస్టు సిరిస్ గెలిచిన ఉత్సాహాంతో ఉన్న టీమిండియా మరో మూడు మూడు రోజుల్లో వన్డే సిరిస్ సన్నాహాకాల్లో ఉంది. ఇరు జట్ల మధ్య తొలి వన్డే ఈ నెల 16న హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరగనుంది.

కాగా, న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరిస్ కోసం బీసీసీఐ ఇప్పటికే భారత జట్టును ప్రకటించింది. వన్డే సిరిస్‌కు ధోని నాయకత్వం వహించనున్నాడు. రైనా స్థానంలో తుది జట్టులోకి మరొకరిని తీసుకోనున్నారు. సురేష్ రైనా (29) ఇప్పటి వరకు 223 వన్డే మ్యాచ్‌లు ఆడాడు.
న్యూజిలాండ్ టెస్టు సిరిస్ అనంతరం వన్డే జట్టులో చోటు సంపాదిచాడు. అయితే వైరల్ ఫీవర్ కారణంగా తొలి వన్డేకు దూరమయ్యాడు. రైనా తన చివరి వన్డేని దక్షిణాఫ్రికా జట్టుపై ముంబైలోని వాంఖడే మైదానంలో అక్టోబర్ 25, 2015లో ఆడాడు. ఆ తర్వాత భారత జట్టు ఆడిన ఆస్టేలియా (జనవరి 2016), జింబాబ్వే (జూన్ 2016) వన్డే సిరిస్‌లలో చోటు దక్కలేదు.