హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీ, వెస్టిండిస్ పర్యటనకు గాను బీసీసీఐ ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకోని టీమిండియా వెటరన్ ఆటగాడు సురేశ్ రైనా ప్రస్తుతం కుటుంబంతో కలిసి నెదర్లాండ్స్‌లో పర్యటిస్తున్నాడు. రైనా భార్య ప్రియాంకా ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో ఉద్యోగం చేస్తోంది.
ఈ సందర్భంగా సురేశ్ రైనా దక్షిణాఫ్రికాలో నెదర్లాండ్స్ క్రికెటర్లు శిక్షణ పొందే అకాడమీని సందర్శించాడు. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిరెస్టన్ నేతృత్వంలో ప్రస్తుతం నెదర్లాండ్స్ అండర్-17 ఆటగాళ్లు మూడు రోజుల పాటు ట్రైనింగ్ క్యాంప్‌లో పాల్గొన్నారు.
ఇక్కడ గ్యారీని కలుసుకున్న సురేశ్ రైనా ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'మంచి ప్రతిభ ఉన్న వ్యక్తి ఆధ్వర్యంలో శిక్షణ పొందడం చాలా ఆనందంగా ఉంది. గ్యారీ నుంచి ఎప్పుడైనా కొత్త విషయాల గురించి తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు' అని రైనా పేర్కొన్నాడు.
అనంతరం నెదర్లాండ్స్‌కు చెందిన యువ క్రికెటర్లతో సమావేశమై వారితో తన అనుభవాలను పంచుకున్నట్లు రైనా తెలిపాడు. త్వరలో రైనా తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో సందడి చేయనున్నాడు. కిరెస్టన్ గతంలో టీమిండియాకి కోచ్‌గా పనిచేశాడు. గ్యారీ కిరెస్టన్ హాయాంలో ధోని నేతృత్వంలోని టీమిండియా 2011 వరల్డ్ కప్‌ని సాధించింది.