For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Suresh Raina Retirement: నా నరనరానా క్రికెట్టే.. రిటైర్‌మెంట్‌పై సురేశ్‌ రైనా భావోద్వేగ లేఖ!!

Suresh Raina Posts Emotional Statement After Retiring From International Cricket

హైదరాబాద్: టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా శనివారం ఆటకు అల్విదా చెప్పాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ఇచ్చిన ఐదు నిమిషాలకే.. రైనా క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఆశ్చర్యపరిచాడు. టీమిండియాకు కీలక విజయాలు అందించిన రైనా వయసు కేవలం 33 సంవత్సరాలే. ఇంకా 5-7 ఏళ్లు క్రికెట్ ఆడే సత్తా అతనిలో ఉంది. కానీ అనూహ్యంగా 33 ఏళ్లకే కెరీర్‌ను ముగించాడు. వీడ్కోలు పలకడంపై రైనా ఆదివారం భావోద్వేగంతో ఓ లేఖ రాశాడు.

నా నరనరానా క్రికెట్టే:

నా నరనరానా క్రికెట్టే:

'మిశ్రమ అనుభూతులతో వీడ్కోలు ప్రకటన చేస్తున్నా. నిజం చెప్పాలంటే.. చిన్నప్పటి నుంచీ గల్లీల్లో ఆడుతూ క్రికెట్‌ను ఇష్టపడ్డాను. చిన్న పట్టణం నుంచి వచ్చి ఎంతో శ్రమించి భారత జట్టులో అడుగుపెట్టాను. నాకు తెలిసింది క్రికెట్ ఒక్కటే. చేసిందంతా క్రికెట్టే. నా నరనరానా అదే జీర్ణించుకుపోయింది. దేవుడి ఆశీర్వాదం, అండగా నిలిచిన అభిమానుల ప్రేమను ప్రతి రోజూ గుర్తు చేసుకున్నాను. వారి ప్రేమ, అభిమానాలకు విలువ చేకూర్చేందుకే ప్రయత్నించాను. ఆటకు, దేశానికి అంకితమయ్యాను' అని సురేష్ రైనా తెలిపాడు.

ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నా:

ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నా:

'క్రికెట్ ఆడే క్రమంలో ఎన్నో శస్త్రచికిత్సలు జరిగాయి. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నా. కొన్నిసార్లు ముందుకువెళ్లలేకపోయా. ఆగిపోతే న్యాయం కాదనే మరలా ముందుకు సాగాను. నా ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది. అందరి సహకారం లేకుండా ఇది సాధ్యమయ్యేదే కాదు. నా తల్లిదండ్రుల త్యాగాలు, ప్రేమించే భార్య, పిల్లలు, సోదరులు, సోదరీమణులు, కుటుంబ సభ్యులు నన్నెంతో ప్రోత్సహించారు. నేను సరైన దారిలో నడిచేందుకు నా కోచ్‌లు మార్గనిర్దేశం చేశారు. గాయాల నుంచి కోలుకొనేందుకు ఫిజీషియన్లు, అత్యుత్తమంగా రాణించేందుకు ట్రైనర్లు సాయం చేశారు' అని రైనా చెప్పాడు.

ఆ అదృష్టం నాకు దక్కింది:

ఆ అదృష్టం నాకు దక్కింది:

'నీలిరంగు జెర్సీలు ధరించే మా కుర్రాళ్ల సహకారం లేకుండా నా కెరీర్‌ సాగేదే కాదు. భారత జట్టులో అత్యుత్తమ ఆటగాళ్లతో కలిసి ఆడే అదృష్టం నాకు దక్కింది. రాహుల్‌ భాయ్‌, అనిల్‌ భాయ్‌, సచిన్‌ పాజీ, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, వీరేందర్ సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ లాంటి దిగ్గజాలతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నా. నన్ను స్నేహితుడిగా భావిస్తూ మార్గనిర్దేశం వహించిన మహీ సారథ్యంలో ఆడటం అద్భుతం. బీసీసీఐ, యూపీ క్రికెట్‌ సంఘానికి కృతజ్ఞతలు. ఒక యూపీ కుర్రాడికి భారత్ తరఫున ఆడే అవకాశం కల్పించారు' అని యూపీకి చెందిన రైనా పేర్కొన్నాడు.

ప్రేమాభిమానాలతోనే పెరిగి పెద్దయ్యా:

'ఇక అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఇన్నేళ్లూ మీరు చూపించిన ప్రేమ, అభిమానాలతోనే పెరిగి పెద్దయ్యాను. అంతర్జాతీయ క్రికెట్లో అత్యున్నతంగా ఎదిగేందుకు అండగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. ఎప్పటికీ మీరు ప్రేమించే మీ సురేశ్‌ రైనా' అని భావోద్వేగ లేఖను పోస్ట్‌చేశాడు. ఓ వీడియోనూ కూడా జత చేశాడు. దశాబ్దకాలం అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగిన రైనా.. 18 టెస్ట్‌లు, 226 వన్డేలు, 78 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. టెస్ట్‌ల్లో 768, వన్డేల్లో 5615, టీ20ల్లో 1605 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఏడు సెంచరీలు నమోదు చేశాడు. ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన రైనా టెస్ట్‌ల్లో 13, వన్డేల్లో 36, టీ20ల్లో 13 వికెట్లు తీశాడు.

Story first published: Monday, August 17, 2020, 11:55 [IST]
Other articles published on Aug 17, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+