రైనా మంచి మనసు.. కరోనా కోసం భారీ విరాళం!!

గుజరాత్: భారత దేశంలో మహమ్మారి కరోనా (కొవిడ్ 19) వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 900 మందికి పైగా కరోనా సోకగా.. దాదాపు 20 మంది మృతిచెందారు. దీంతో దేశంలోని సెలెబ్రిటీలు ప్రజలకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మరోవైపు కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా తీసుకుంటున్న చర్యలకు తన వంతు సాయం అందించడానికి కూడా ముందుకొచ్చారు. ఈ క్రమంలో టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మన్, టీ20 స్పెషలిస్ట్ సురేశ్ రైనా తన మానవత్వాన్ని చాటుకున్నాడు.

రూ. 52 లక్షల విరాళం:
కరోనాపై జరుగుతున్న పోరులో సురేశ్ రైనా తన వంతు సాయంగా రూ. 52 లక్షల విరాళం ప్రకటించాడు. ఈ మొత్తం విరాళంలో రూ. 31 లక్షలు ప్రధానమంత్రి సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ ఫండ్ (పీఎం కేర్స్ ఫండ్)కు, రూ. 21 లక్షలు ఉత్తరప్రదేశ్ సీఎం డిజాస్టర్ రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్టు ప్రకటించాడు. ప్రతి ఒక్కరు తమ శక్తిమేర సాయం చేయాలని కూడా కోరాడు. అందరూ ఇంట్లోనే ఉండాలని కోరుతూ ఓ ట్వీట్ చేశాడు.

నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తాను:
ఇటీవల సురేష్ రైనా ఓ పోస్టర్ పట్టుకుని కనిపించాడు. అందులో... 'నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తాను. మరి మీరు? వారిని (కుటుంబాన్ని) కాపాడుకునేందుకు ఇంట్లోనే ఉంటాను. మరి మీరు?' అని అవగాహన కల్పించే ప్రయత్నం చేశాడు. అంతకుముందు ఆకతాయిలు కరోనాపై తప్పుడు సమాచారాన్ని ఇతరులకు చేరవేయొద్దని హెచ్చరించాడు. మాస్క్ ధరించిన ఓ ఫొటోను ట్విటర్‌లో పోస్టు చేసి.. ప్రజలకు పలు సూచనలు చేసాడు. ప్రమాదకర కరోనా వైరస్‌ను నివారించడానికి సామాజిక బాధ్యతగా స్వీయ నిర్బంధంలో ఉండే అవసరాన్ని మనమంతా అర్థం చేసుకోవాలన్నాడు. ఇతరుల నుంచి వచ్చే తప్పుడు సమాచారాన్ని మరొకరికి పంపకండి అని కోరాడు.

కుటుంబంతో సరదా సమయం:
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడైన సురేష్ రైనా.. ఈ నెల మొదట్లో ఎంఎస్ ధోనీ, అంబటి రాయుడు, పీయూష్ చావ్లా తదితరులతో కలిసి ట్రైనింగ్ క్యాంపులో పాల్గొన్నాడు. అయితే కరోనా కారణంగా ఆ తర్వాత క్యాంపును నిలిపివేశారు. దీంతో రైనా ఇంటికి చేరుకొని కుటుంబంతో కలిసి సరదా సమయం గడిపాడు. భారత్ తరఫున రైనా 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. గత ఏడాది జూలైలో చివరిగా వన్డే ఆడిన రైనా.. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. కానీ దేశవాళీ క్రికెట్‌లో తరచుగా మ్యాచ్‌లు ఆడుతున్న రైనా.. ఐపీఎల్-12 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సత్తాచాటాడు. ఆపై గాయం కారణంగా ఆటకు చాలా నెలలు దూరమయ్యాడు.

రైనాకు మరోసారి తండ్రిగా ప్రమోషన్:
సురేశ్ రైనా, అతని భార్య ప్రియాంక రైనా రెండోసారి తల్లిదండ్రులు అయ్యారు. సోమవారం తెల్లవారుజామున ప్రియాంక రైనా పండంటి మగ బిడ్డకు జన్మిచ్చారు. రైనా దంపతులకు ఇప్పటికే 4 ఏళ్ల పాప (గ్రేసియా రైనా) ఉంది. ఇప్పుడు అబ్బాయి పుట్టడంతో ప్రస్తుతం రైనా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని 'ఎంఎస్ ధోనీ ఫాన్స్ అఫీషియల్' తెలిపింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications