లంక ప్రీమియర్ లీగ్ (ఎల్‌పీఎల్) తొలి వేలంలో ఒక షాకింగ్ ఘటన జరిగింది. ఈ లీగ్ తొలిసారి ప్లేయర్ల వేలంపాట నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేలంలో టీమిండియా వెటరన్, ఐపీఎల్ లెజెండ్ సురేష్ రైనా కూడా పేరు నమోదు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో భారత ఫ్యాన్స్ కూడా ఈ వేలంపై ఆసక్తి కనబరిచారు.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రైనా.. విదేశీ లీగ్స్‌లో ఆడే అవకాశం లేకపోవడంతో దేశవాళీలకు కూడా రిటైర్‌మెంట్ ప్రకటించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇదే క్రమంలో అతను లెజెండ్స్ లీగ్ క్రికెట్, రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్, అబుదాబి టీ10 లీగ్, లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ వంటి టోర్నీల్లో పాల్గొన్నాడు. ఇప్పుడు ఈ జాబితాలో లంక ప్రీమియర్ లీగ్‌లో కూడా చేరుతుందని ఫ్యాన్స్ అనుకున్నారు.

ప్లేయర్ల వేలం మొదలైన తర్వాత జాబితాలో సురేష్ రైనా పేరు కూడా కనిపించింది. దీంతో ఫ్యాన్స్ చాలా ఎగ్జయిట్ అయ్యారు. కానీ అనూహ్యంగా వేలం నిర్వహిస్తున్న ఆక్షనీర్ చారు శర్మ.. రైనా పేరును ఎవాయిడ్ చేసింది. అతని పేరును పలకలేదు. ఇది చూసిన అభిమానులకు ఏం అర్థం కాలేదు. 11వ సెట్‌లో రైనా పేరు ఎందుకు ఎవాయిడ్ చేశారని నెట్టింట ప్రశ్నల వర్షం కురిపించారు.
దీనిపై తాజాగా వివరణ దొరకినట్లయింది. రైనా ఈ వేలంలో పాల్గొనడానికి సుముఖంగా లేడట. అందుకే అతను తన పేరును వేలంలో నమోదు కూడా చేసుకోలేదట. కానీ నిర్వాహకులు మాత్రం రైనా పేరును కూడా ఈ జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్టులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. లంక ప్రీమియర్ లీగ్‌లో రైనా ఆడటం లేదని తేల్చి చెప్పారు. ఈ ఏడాది జరిగే రోడ్ సేఫ్టీ సిరీస్‌లో మళ్లీ రైనా మైదానంలో దిగుతాడని తెలుస్తోంది.