
టీమిండియా మాజీ దిగ్గజం సురేష్ రైనా షాకింగ్ కామెంట్స్ చేశాడు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ పేరు చెప్పి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం ఖతార్ వేదికగా జరుగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్‌సీ మాస్టర్స్)లో సురేష్ రైనా ఆడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వరల్డ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రైనా అద్భుతంగా ఆడాడు. ఈ మ్యాచ్‌లో 49 పరుగులు చేసిన రైనా.. ఇండియా మహరాజాస్ పోరాడగలిగే స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
అతను ఇలా అద్భుతంగా ఆడుతుండటం చూసిన రిపోర్టర్లు రైనాను ఒక ప్రశ్న అడిగారు. ఇంకా ఫామ్‌లో ఉన్న అతను మళ్లీ ప్రొఫెషనల్ క్రికెట్‌లో అడుగు పెడతారా? రిటైర్‌మెంట్‌ను వెనక్కు తీసుకుంటారా? అని అడిగారు. దీనికి సమాధానంగా నవ్వేసిన రైనా.. తానేం పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీని కాదని చెప్పాడు. ఈ సమాధానం వినగానే అక్కడ ఉన్న వాళ్లంతా ఫక్కున నవ్వేశారు. పాక్ మాజీ సారధి అప్రిదీ చాలా సార్లు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి, మళ్లీ తిరిగి ఆడిన సంగతి తెలిసిందే. దీనిపైనే రైనా కామెంట్ చేశాడు.
'నేను సురేష్ రైనాను. షాహిద్ అఫ్రిదీని కాను కదా. రిటైర్‌మెంట్ తీసేసుకున్నా' అని రైనా తేల్చిచెప్పాడు. తను తన నిర్ణయానికి కట్టుబటి ఉంటానని వెల్లడించాడు. కాగా, ఎల్ఎల్‌సీలో ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింట్లో ఓడిన ఇండియా మహరాజాస్ జట్టు ఎలిమినేటర్స్ ఆడనుంది.
ఇండియన్ మహరాజాస్ ఆడిన చివరి మ్యాచ్‌లో రైనా 49 పరుగులతో ఆకట్టుకున్నాడు. కానీ వరల్డ్ జెయింట్స్ ప్లేయర్ క్రిస్ గేల్ 57 పరుగులతో చెలరేగడంతో ఇండియన్ మహరాజాస్‌కు ఓటమి తప్పలేదు. ఇది ఇండియన్ మహరాజాస్‌కు వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం. దీంతో ఈ జట్టు ఇక ఎలిమినేటర్స్‌లో తన అదృష్టం పరీక్షించుకోనుంది.