
దుబాయ్: యూఏఈ, ఒమన్‌లో టీ20 ప్రపంచకప్ 2021 మెగా సమరం ఈరోజు ప్రారంభం అయింది. ఆదివారం క్వాలిఫైయర్ మ్యాచులు మొదలయ్యాయి. తొలి గేమ్‌లో ఒమన్ జట్టు పాపువా న్యూ గినియాతో తలపడుతుంది. సూపర్ 12 స్టేజ్ మాత్రం అక్టోబర్ 23న ఆరంభం కానుండగా.. అక్టోబర్ 24న భారత్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది. దాయాది దేశం పాకిస్తాన్‌తో భారత్ తన తొలి మ్యాచులో తలపడనుంది. సారథిగా విరాట్ కోహ్లీకి ఇదే చివరి టోర్నీ టీ20 కానుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ సురేష్ రైనా టీమిండియా ఆటగాళ్లను ఓ కోరిక కోరాడు. కోహ్లీ కోసమైనా ఈసారి కప్ గెలవండన్నాడు. ప్లేయర్స్ సమిష్టిగా రాణించి సారథి కోహ్లీకి ట్రోఫీని అందించాలని కోరాడు.
ఈరోజు ఒమన్‌లో ప్రారంభమైన టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత భారత టీ20 కెప్టెన్‌గా తాను తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ గత నెలలో ప్రకటించాడు. అంతేకాదు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా తన ప్రస్థానాన్ని ముగించాడు. ఎలిమినేటర్‌లో బెంగళూరు ఓడిపోవడంతో టైటిల్ లేకుండానే కోహ్లీ కెప్టెన్సీ కెరీర్ ముగిసింది. ఇక ప్రపంచకప్ 2021 అనంతరం కూడా పొట్టి ఫార్మాట్ కెప్టెన్‌గా కూడా తప్పుకోనున్నాడు. దాంతో భారత జట్టు అయినా కప్ గెలవాలని అందరూ కోరుకుంటారు. ఎందుకంటే కోహ్లీ ఖాతాలో ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా లేదు. ఈ క్రమంలోనే కోహ్లీ కోసం అయినా టీమిండియా కప్ కొట్టాలని సురేష్ రైనా కోరుకుంటున్నాడు.
'కెప్టెన్‌గా ఈ టోర్నమెంట్ విరాట్ కోహ్లీకి చివరిది. అందుకే టీ20 ప్రపంచకప్ 2021 టోర్నీ అతడికి చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉండండి. టీమిండియా ప్లేయర్స్.. టీ20 ప్రపంచకప్ 2021ను కోహ్లీ కోసం గెలవండి. ప్రపంచకప్ 2021 ప్రారంభమయ్యే వరకు భారత అభిమానులు వేచి ఉండలేరు. మనకు ఆటగాళ్లు ఉన్నారు. సమిష్టిగా రాణిస్తే మనదే విజయం' అని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కోసం రాసిన ఓ కాలమ్‌లో సురేష్ రైనా పేర్కొన్నాడు. యూఏఈలోని పరిస్థితులు భారతదేశం, పాకిస్తాన్‌ల మాదిరే ఉంటాయని.. ఆసియా జట్లు తమ సహజ ఆట ఆడటానికి ఇది మంచి అవకాశం అని రైనా అన్నాడు.
'భారత బ్యాటింగ్ టాప్ ఆర్డర్‌పై ఆధారపడివుంటుంది . రోహిత్ శర్మ స్టార్ ప్లేయర్. అతను గతంలో జరిగిన ఐసీసీ ఈవెంట్లలో అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు. గొప్ప ఐపీఎల్ సీజన్లు కూడా ఉన్నాయి. రోహిత్, కెఎల్ రాహుల్ మరియు విరాట్ 15 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేయాలి. దాంతో భారత జట్టుకు భారీ స్కోర్ చేయడానికి వీలుంటుంది. ఈ ముగ్గురు రాణిస్తే.. ఎంత పెద్ద లక్ష్యం అయినా భారత్ ఛేదిస్తుంది. ఇక మిడిల్ ఆర్డర్‌లో చాలా కాంబినేషన్‌లు ఉన్నాయి. రిషబ్ పంత్ కీలక పాత్ర పోషించబోతున్నాడు. హార్దిక్ పాండ్యా పవర్ హిట్టర్‌గా కూడా చాలా సమర్థుడు. మెగా టోర్నీలో పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి మేటి జట్లు ఉన్నాయన్న విషయం కోహ్లీసేన మార్చిపోకూడు. టీ20 క్రికెట్లో ఏదైనా జరగొచ్చు' అని రైనా పేర్కొన్నాడు.
యూఏఈ, ఒమన్ వేదికల్లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బాగా ఆడగలడని సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు. టీమ్‌లో శార్దూల్ ఠాకూర్ రాకతో జట్టుకు మరింత బలం చేకూరిందని పేర్కొన్నాడు. భారత జట్టులో ఆడేందుకు రుత్‌రాజ్ గైక్వాడ్ సిద్ధంగా ఉన్నాడని, ఐపీఎల్లో అతడు ఆడిన తీరు బాగుందన్నాడు. రుత్‌రాజ్ కూడా ఎంఎస్ ధోనీ భాయ్లానే కూల్‌గా ఉంటాడని రైనా కితాబిచ్చాడు. ఐపీఎల్ 2021లో రైనా విఫలమయిన సంగతి తెలిసిందే. కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు.