హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దులీప్ ట్రోఫీలో భాగంగా ఘజియాబాద్ నుంచి కాన్పూర్‌కు వెళుతున్న సమయంలో రైనా ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ ఎస్ యూఏ కారు టైరు పేలిపోయింది. దీంతో కుదుపుకు గురైన కారు ఒక్కసారిగా అదుపు తప్పింది.
కారు టైరు పేలిన సమయంలో రైనా మెల్లగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని స్థానిక పోలీస్ అధికారి తెలిపారు. కాగా, దులీప్ ట్రోఫీలో ఇండియా బ్లూ జట్టుకు రైనా కెప్టెన్‌గా ఉన్నాడు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం కాన్పూర్‌లోని గ్రీన్ పార్కు స్టేడియానికి కారులో బయల్దేరగా ఎత్వాలోని ఫ్రెండ్స్ కాలనీ వద్ద టైరు పేలిపోయింది.

కారులో మరొక టైరు లేకపోవడంతో రైనా మరో కారు వచ్చే వరకు అక్కడే నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో స్ధానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో రైనాకు మరో కారుని ఏర్పాటు చేశారు. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.