మొహాలి: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం (అక్టోబర్ 22)న మూడో వన్డే మొహాలిలో జరగనుంది. జ్వరం కారణంగా రెండు వన్డేలకు దూరమైన సురేశ్ రైనా మూడో వన్డేలోనైనా చోటు దక్కించుకుంటాడా లేదా అనే విషయం ఆసక్తికరంగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సాధారణంగా క్రికెట్‌లో ఓ ఆటగాడు గాయపడటం.. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన మరో ఆటగాడు రాణించడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత గాయపడ్డ ఆటగాడు కోలుకుని తర్వాత మ్యాచ్‌కి సిద్ధమైతే ఇద్దరిలో ఎవరిని ఎంచుకోవాలో తెలియక కెప్టెన్ సతమతమవడం తరచూ జరుగుతూ ఉంటుంది.
తాజాగా భారత్-న్యూజిలాండ్ సిరిస్‌లో ధోనికి ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా తొలి మూడు వన్డేల జట్టులో ఎంపికైన సురేశ్ రైనా... జ్వరం కారణంగా తొలివన్డేకు దూరమవ్వడంతో అతని స్థానంలో కేదార్ జాదవ్‌కు చోటు లభించింది.

తనకు అందివచ్చిన అవకాశాన్ని కేదార్ జాదవ్ తొలి వన్డేలో చక్కగా వినియోగించుకున్నాడు. తొలి వన్డేలో రెండు వికెట్లు తీసుకుని భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక రెండో వన్డేకి కూడా రైనా కోలుకోకపోవడంతో రెండో వన్డేకి కూడా అదృష్టం జాదవ్‌ని వరించింది.
రెండో వన్డేలో జాదవ్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. తొలుత బౌలింగ్ వేసి కివీస్ టాప్ బ్యాట్స్ మెన్ లాంథమ్‌ని ఔట్ చేయడంతో పాటు బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్ విఫమైన తరుణంలో హార్ధిక పాండ్యాకు తోడుగా నిలిచి సత్తా చాటాడు. ధోనితో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే క్రమంలో 41 పరుగుల వద్ద జాదవ్ పెవిలియన్‌కు చేరాడు.
ఒత్తిడిలో కూడా ధోనితో కలిసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రెండో వన్డేలో భారత్ ఓటమి పాలైన పాండ్యా, జాదవ్ మంచి ఆటతీరుతో ఆకట్టుకున్నారు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జాదవ్‌ను తప్పించి ప్రస్తుతం ఫామ్ లేమితో బాధపడుతున్న రైనాకు చోటు కల్పిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.