
రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం రాత్రి ఇండియా లెజెండ్స్ వర్సెస్ ఆస్ట్రేలియా లెజెండ్స్ మధ్య జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022 మొదటి సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. అభిమన్యు మిథుబ్ వేసిన 16వ ఓవర్‌లో బెన్ డంక్ బ్యాక్‌వర్డ్ పాయింట్ ద్వారా బౌండరీ కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే రైనాను ఆ ప్లేసులో ఫీల్డింగ్ ఉన్నాడు. బాల్ రైనాకు లెఫ్ట్ సైడ్‌లో బౌండరీ దిశగా వెళ్తున్న టైంలో.. గాలిలో డైవ్ చేసి రైనా అద్భుత క్యాచ్ అందుకున్నాడు. ఇక రైనా క్యాచ్ చూసి సహచర ఫీల్డర్లు, బ్యాటర్, ప్రేక్షకులు స్టన్నయిపోయారు. ఒక్కసారిగా గ్రౌండ్ రైనా పేరుతో మారుమోగింది. తన ఫీల్డింగ్‌లో ఏమాత్రం జోరు తగ్గలేదని ఈ క్యాచ్ ద్వారా రైనా చూపించాడు. ఈ క్యాచ్ అనంతరం రైనా తనదైన స్టైల్‌లో సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. అయితే ఈ క్యాచ్ టైంలో రైనా వేళ్లకు కాస్త గాయమైంది.
రాయ్‌పూర్‌లో అడపాదడపా వర్షం పడడంతో మ్యాచ్ కొనసాగడం ఇబ్బంది అయింది. సాయంత్రం వర్షం ఆగిపోవడంతో గంట ఆలస్యంగా ఆట మొదలైంది. ఇండియా లెజెండ్స్ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా లెజెండ్స్ ఓపెనర్లు షేన్ వాట్సన్, అలెక్స్ డూలన్ స్వేచ్ఛగా ఆడుతూ స్కోరుబోర్డును ఉరకలెత్తించారు. పవర్‌ప్లేలో ఆసీస్ ఎల్ ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. లెగ్ స్పిన్నర్ రాహుల్ శర్మ బౌలింగ్లో వాట్సన్ (21బంతుల్లో 30) ఔట్ అవడంతో భారత్ మళ్లీ గాడిలో పడింది. ఆ తర్వాత ఓజా బౌలింగ్లో డూలన్ (35)కూడా ఔటయ్యాడు. ఇకపోతే బెన్ డంక్ (26బంతుల్లో 46పరుగులు 5ఫోర్లు, 2సిక్సులు) ఉన్నంత సేపు దడదడలాడించాడు. రైనా చేతికి అతను చిక్కడంతో ఆసీస్ స్కోరు వేగం మందగించింది. అభిమన్యు మిథున్, యూసుఫ్ పఠాన్‌లు చెరో 2వికెట్లు తీశారు. ఇక ఆట మధ్యలో మరోసారి వర్షం రావడంతో 17ఓవర్ల వద్ద ఆట ఆపేశారు. ఈరోజు మళ్లీ ఆట మొదలవుతుంది. రిజర్వ్ డే ఉంచడం ప్లస్ పాయింట్. ఇకపోతే 17ఓవర్లకు 5వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా లెజెండ్స్ 136స్కోరు చేసింది.