

హైదరాబాద్: చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 5000 పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా సురేశ్ రైనా చరిత్ర సృష్టించాడు. చిదంబరం స్టేడియంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 19 పరుగులు చేయడం ద్వారా.. ఐపీఎల్‌లో 5వేల పరుగుల మార్క్‌ని అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌కి ముందు 5000 పరుగుల క్లబ్‌లో చేరేందుకు సురేశ్ రైనాకు 15 పరుగులు అవసరమయ్యాయి. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడుతున్న సురేశ్ రైనా.. ఈ మ్యాచ్‌కి ముందు 176 మ్యాచ్‌ల్లో 4,985 పరుగులతో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో సింగిల్ తీయడం ద్వారా రైనా ఈ మైలురాయిని అందుకున్నాడు.
మరోవైపు సురేశ్ రైనా తర్వాత ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం 4,948 పరుగులతో కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో 12 బంతులాడిన కోహ్లీ 6 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు.