బెంగళూరు: గుజరాత్ లయన్స్ పైన రాయల్ చాలెంజర్ బెంగళూరు జట్టు 144 పరుగులతో గెలవడంపై లయన్స్ జట్టు కెప్టెన్ సురేష్ రైనా స్పందించాడు. ఆయన క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు. తన జట్టు ఓడిపోయినప్పటికీ.. ప్రత్యర్థి బెంగళూరు జట్టు ఆడిన తీరును అభినందించాడు.
అతను మ్యాచ్‌ను ఆన్ లైన్‌లో చూశాడు. తొలిసారి ఓ అద్భుతమైన ఆటను మిస్సయ్యానని ట్వీట్ చేశాడు. ఐపీఎల్‌లోనే ఇది అద్భుతమైన ఆట అన్నాడు. ఏబీ డివిల్లీయర్స్, విరాట్ కోహ్లీ ఇద్దరూ బాగా ఆడారని కితాబునిచ్చాడు. తమ జట్టు ఓటమిపాలైందన్న బాధ ఉన్నప్పటికీ వారిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్‌ను దగ్గర్నుంచి చూడలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ రోజు నాకు నవ్వే హక్కు ఉందని విరాట్ కోహ్లీ అన్నాడు. టాస్ ఓడిపోవడం తప్ప అంతా మా ప్రణాళిక ప్రకారమే జరిగిందని చెప్పాడు. ప్లే ఆఫ్ కోసం ఇక పైన కూడా మేం ఇలాగే పోరాడుతామని చెప్పాడు. మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టుకోకూడదని అనుకున్నామని చెప్పాడు.
ఈ మ్యాచ్ గురించి మరీ ఎక్కువగా ఆలోచించలేదని, పరిస్థితులకు తగ్గట్లు స్మార్ట్ క్రికెట్ ఆడామని చెప్పాడు. స్ట్రయిక్ రొటేట్ చేశామని, మేం ఎంత బాగా బ్యాటింగ్ చేశామనే దాని పైన నేను మాట్లాడదల్చుకోలేదని చెప్పాడు.
డివిల్లీయర్స్ మాట్లాడుతూ.. నేను భయం లేకుండా క్రీజులోకి వచ్చానని, వికెట్ కోల్పోతానన్న భయం కలగలేదని, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నేను, కోహ్లీ మంచి నిర్ణయాలు తీసుకున్నామని, చివర్లో జోరు పెంచామని చెప్పాడు. ట్వంటీ 20లలో డాట్ బాల్స్ ఆడటం తనకు ఇష్టం ఉండదని చెప్పాడు.