సర్వత్రా ఆసక్తి: బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్ గంగూలీ?
హైదరాబాద్: బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న అనురాగ్ ఠాకూర్‌పై సుప్రీం కోర్టు వేటు వేసిన నేపథ్యంలో ఇప్పుడు బీసీసీఐ కొత్త అధ్యక్షుడు ఎవరు? అనే దానిపై ఆసక్తి నెలకొంది. లోథా కమిటీ ఇచ్చిన సిఫారసులు అమలు చేయలేదనే కారణంతో బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేను సుప్రీం తొలగించిన సంగతి తెలిసిందే.
70 ఏళ్లకు పైబడిన వారు బోర్డులో సభ్యులుగా ఉండకూడదనే లోధా కమిటీ సిఫారసుల నేపథ్యంలో కొత్త అధ్యక్షుడు ఎవరనే దానిపై క్రికెట్ వర్గాల్లో అప్పుడే చర్చ మొదలైంది. సుప్రీం తీర్పు తాజా నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

బీసీసీఐ అధ్యక్షుడి ఎంపికలో ఐదు జోన్లు కీలకపాత్ర
ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక ధనిక బోర్డుగా ఉన్న బీసీసీఐ అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఐదు జోన్లు కీలకపాత్ర పోషిస్తున్నాయి. రొటేషన్ పద్దతి ప్రకారం మూడేళ్లకోసారి ఒక్కో జోన్ నుంచి బీసీసీఐ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఈస్ట్ జోన్‌కు చెందిన అనురాగ్ ఠాకూర్ తన పదవిని కోల్పోయారు.

శశాంక్ మనోహర్ రాజీనామాతో అనురాగ్
గతంలో ఇదే ఈస్ట్ జోన్ నుంచి బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న శశాంక్ మనోహర్ రాజీనామాతో అనురాగ్ ఆ పదవిని చేపట్టారు. ఈస్ట్ జోన్‌లో ఉన్న ఆరు క్రికెట్ అసోసియేషన్లు అనురాగ్ ఠాకూర్‌కు మద్దతివ్వడంతో అనురాగ్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే ఇప్పుడు ఈస్ట్ జోన్ నుంచి సరైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరు వినిపిస్తోంది.

అధ్యక్ష బరిలో టీఎస్ మాథ్యూ, గౌతమ్ రాయ్
బీసీసీఐ అధ్యక్ష బరిలో టీఎస్ మాథ్యూ, గౌతమ్ రాయ్‌లు లాంటి వారి పేర్లు వినిపిస్తున్నా సౌరభ్ గంగూలీ పేరే ప్రధానంగా వినిపిస్తోంది. మరోవైపు బోర్డు పూర్తి స్థాయి కార్యవర్గం కోసం ఈ నెల 19న కేసు తదుపరి విచారణ సందర్భంగా ఆదేశాలిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. బోర్డు పాలనా వ్యవహారాలు చూసేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీం నిర్ణయించింది. అప్పటిదాకా బోర్డులోని సీనియర్ ఉపాధ్యక్షుడు తాత్కాలిక అధ్యక్షునిగా, సంయుక్త కార్యదర్శి తాత్కాలిక కార్యదర్శిగా కొనసాగుతారని వ్యాఖ్యానించింది.

గంగూలీ సమర్థత, నిజాయితీ
ఈ కమిటీలోకి ఎవరెవరిని తీసుకోవాలో సూచించాలని సీనియర్ న్యాయవాదులు నారిమన్, గోపాల్ సుబ్రమణ్యంలను సర్వోన్నత న్యాయస్థానం కోరింది. ప్రస్తుతం క్రికెట్ అసోషియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడిగా ఉన్న సౌరభ్ గంగూలీ సమర్థత, నిజాయితీ లాంటి అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని అతడి పేరు ఖాయమైనట్టే అని క్రికెట్ వర్గాలు అనుకుంటున్నాయి.

గంగూలీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో
అయితే దీనిపై గంగూలీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అనే సందేహాన్ని కూడా కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా పేరున్న బీసీసీఐని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అయితేనే సమర్ధవంతంగా నడపగలడని పలువురు అభిప్రాయపడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications