హైదరాబాద్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న మిగతా రెండు మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలపై బీసీసీఐ సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. ముంబై, చెన్నైలలో జరగనున్న మిగితా రెండు టెస్టు మ్యాచ్‌ల కోసం రూ. 1.33 కోట్లు కావాలని కోరుతూ మంగళవారం బీసీసీఐ అత్యున్నత న్యాయస్ధానంలో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు మధ్యాహ్నాం 3 గంటలకు విచారణ చేపడామని తెలిపింది. బీసీసీఐ తరుపున ప్రముఖ సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టులో దాఖలు చేశారు. సుప్రీం కోర్టు ఛీప్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ దీనిని విచారించనుంది.
క్రికెట్‌లో సంస్కరణల అమలుకు గాను లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనలను బీసీసీఐ తోసిపుచ్చడంతో ఆగ్రహించిన సుప్రీంకోర్టు బీసీసీఐ బ్యాంకు లావాదేవీలను గతంలో స్తంభింపజేసిన సంగతి తెలిసిందే. దీంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు ముందు బీసీసీఐ సుప్రీం కోర్టుని ఆశ్రయించింది.

దీంతో రాజ్ కోట్‌లో జరిగిన తొలి టెస్టుకు గాను సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు రూ. 58.66 లక్షలు విడుదల చేయాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 8 నుంచి ముంబైలో నాలుగో టెస్టు జరగుతుండగా, డిసెంబర్ 16 నుంచి చెన్నైలో ఐదో టెస్టు జరగనుంది.
రెండు టెస్టు మ్యాచ్‌ల నిర్వహణకు గాను సుమారు రూ.1.55కోట్లు కావాలని కోరుతూ తాజాగా బీసీసీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఐదు టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు గురువారం నుంచి ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనుంది.
ఇదిలా ఉంటే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇంగ్లాండ్‌పై 2-0తో టీమిండియా ఆధిక్యంలో నిలిచింది. రాజ్ కోట్‌లో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగియగా, ఆ తర్వాత విశాఖపట్నం, మొహాలిలో జరిగిన రెండు టెస్టుల్లో ఇంగ్లాండ్‌పై టీమిండియా విజయం సాధించింది.
నిధుల విడుదలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
ఇంగ్లాండ్‌తో ప్రస్తుతం భారత్‌లో జరగనున్న చివరి రెండు టెస్టుల కోసం రూ.1.33 కోట్లను విడుదలకు బీసీసీఐకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐదు టెస్టుల సిరిస్‌లో భాగంగా చివరి రెండు టెస్టులు ముంబై, చెన్నైలలో జరగనున్న సంగతి తెలిసిందే.
టెస్టు సిరిస్‌తో పాటు వన్డే, టీ20 సిరిస్‌లకు రూ. 2.83 కోట్ల వరకు ఖర్చు పెట్టుకోవచ్చని సుప్రీం కోర్టు ఆదేశించింది. స్టు సిరీస్ అనంతరం ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే, టీ20 మ్యాచ్‌ల నిర్వహణకు రూ.3.79 కోట్లు విడుదలపై బీసీసీఐ పెట్టుకున్న అభ్యర్థనను మాత్రం సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
ఇంగ్లాండ్ సిరీస్‌లో మిగిలి ఉన్న రెండు టెస్టు మ్యాచ్‌ల నిర్వహణకు 1.33 కోట్ల రూపాయలు, 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లకు ఒక్కో మ్యాచ్ నిర్వహణకు 25 లక్షల రూపాయలు చొప్పున నిధులు విడుదల చేయాలని బీసీసీఐకి కోర్టు పరిమితిని విధించింది.