ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 సెమీ ఫైనల్లో టీమిండియా బంగ్లాదేశ్ చేతిలో పరాజయం పాలైంది. భారత్ 194 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి స్కోరును సమం చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. అయిచే సూపర్ ఓవర్లో భారత్ ఒక్క పరుగు కూడా చేయలేకపోయింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ ఒక వైడ్ బాల్ సహాయంతో విజయం సాధించింది. ఈ ఓటమికి ప్రధాన కారణం సూపర్ ఓవర్లో టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న తప్పు నిర్ణయంగా పరిగణించబడుతోంది. వారు 15 బంతుల్లో 38 పరుగులు చేసిన విధ్వంసక బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి బదులు కెప్టెన్ జితేష్ శర్మ, రామ్‌దీప్ సింగ్, ఆశుతోష్ శర్మలను బ్యాటింగ్‌కు పంపారు.
కెప్టెన్ చెప్పిన కారణం ఇదే..
మ్యాచ్ అనంతరం కెప్టెన్ జితేష్ శర్మ ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని వివరించారు. జితేష్ మాట్లాడుతూ.. 'వైభవ్, ప్రియాన్ష్ పవర్ ప్లేలో నిపుణులు.. కానీ డెత్ ఓవర్లలో నేను, ఆశు, రమన్ మాత్రమే మా ఇష్టం వచ్చినట్లు హిట్లు కొట్టగలం. అందుకే ఇది జట్టు నిర్ణయం, నా నిర్ణయం కూడా' అని వెల్లడించాడు.

నిరాశతో కనిపించిన వైభవ్ సూర్యవంశీ
అయితే సూపర్ ఓవర్లో భారత్ బ్యాటింగ్ విఫలమైన తర్వాత నిరాశగా ఉన్న వైభవ్ సూర్యవంశీని చూపిస్తున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాలు అభిమానులలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. కొందరు వ్యక్తులు జితేష్ శర్మ అందరి దృష్టి తనపై ఉండాలని స్వార్థంగా ఆలోచించారు.. అందుకే ఆయన వైభవ్‌ను బ్యాటింగ్ చేయనివ్వలేదని కూడా వ్యాఖ్యానించారు.
సూపర్ ఓవర్‌లో ఒక్క పరుగు కూడా చేయలేదు..
ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ నిరాశపరిచింది. బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించిన భారత్ స్కోరును సమం చేసింది, కానీ సూపర్ ఓవర్‌లో ఓడిపోయింది. సూపర్ ఓవర్‌లో జట్టు మేనేజ్‌మెంట్ తీసుకున్న తప్పుడు నిర్ణయం భారత్ ఓటమికి ఒక ప్రధాన కారణం. వారు వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ష్ ఆర్య వంటి విధ్వంసక బ్యాటర్లకు బదులుగా జితేష్ శర్మ, ఆశుతోష్ శర్మ, రామ్‌దీప్ సింగ్‌లను పంపారు.
బంగ్లాదేశ్ పేస్ బౌలర్ రిపన్ మండల్ వరుసగా రెండు బంతుల్లో జితేష్, ఆశుతోష్‌లను అవుట్ చేయడంతో భారత్ ఆశలు చెదిరిపోయాయి. భారత బౌలర్ సుయాష్ శర్మ వేసిన వైడ్ బాల్ సహాయంతోనే అయినప్పటికీ.. బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌ను గెలిచింది. వారి బ్యాటర్ యాసిర్ అలీ మొదటి బంతికే ఔటైనా కూడా విజయం సాధించింది.