హండ్రెడ్ లీగ్‌లోకి వరుసగా ఐపీఎల్ ఫ్రాంఛైజీలు అడుగుపెడుతున్నాయి. ఇప్పటికే ముంబయి, లఖ్ నవూ సూపర్ జెయింట్స్ ఎంట్రీ ఇవ్వగా.. తాజాగా మరో ఐపీఎల్ టీమ్ కూడా అడుగు పెట్టింది. నార్తర్న్ సూపర్ చార్జర్స్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ భాగస్వామ్యమైంది. ఈ ఫ్రాంఛైజీలోని 49 శాతం వాటాను సన్ గ్రూప్ కొనుగోలు చేసింది. తద్వారా 'హండ్రెడ్ లీగ్ లో వాటాను కొనుగోలు చేసిన మూడో ఐపీఎల్ జట్టు యాజమాన్యంగా సన్ గ్రూప్ నిలిచింది.
బిడ్డింగ్ లో గెలుపొందిన సన్ గ్రూప్ ను.. నార్తర్న్ సూపర్ చార్జర్స్ లో 49 శాతం వాటాను సుమారు 100 మిలియన్ బ్రిటన్ పౌండ్లకు దక్కించుకున్నట్లు తెలిసింది. అంటే భారతీయ కరెన్సీలో రూ.1092 కోట్లు అన్న మాట. సన్ గ్రూప్.. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో పాటు సౌతాఫ్రికా టి20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్‌ను మెయిన్ టెయిన్ చేస్తోంది. దీంతో సన్ గూప్ ఖాతాలో మూడో జట్టు వచ్చి చేరినట్టైంది. కాగా, ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు సంబంధించిన వ్యవహారాలను కావ్య మారన్ చూసుకుంటోందన్న సంగతి తెలిసిందే.

రీసెంట్ గానే లఖ్ నవూ సూపర్ జెయింట్స్ యాజమాన్యం మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టులో వాటాను కొనుగోలు చేయగా, అంతకుముందు ముంబయి ఇండియన్స్ కు చెందిన రిలయన్స్ యాజమాన్యం ఓవల్ ఇన్‌విన్సిబుల్స్ జట్టులో వాటాను దక్కించుకుంది. ఇక ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం నార్తర్న్ సూపర్ చార్జర్స్ లో భాగస్వామ్యమైంది. దిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం జీఎంఆర్ గ్రూప్ కూడా హండ్రెడ్ లీగ్ లోని సదరన్ బ్రేవ్‌లో వాటాను కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం.