ఐపీఎల్‌లో రెండేళ్లుగా పేలవ ప్రదర్శన చేస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. టీం హెడ్ కోచ్‌గా న్యూజిల్యాండ్ మాజీ లెజెండ్ డానియల్ వెటోరీని నియమిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కోచ్‌గా ఉన్న వెటోరీ ఆ టీంను ఫైనల్ వరకూ తీసుకెళ్లాడు.
సన్‌రైజర్స్ టీంను కూడా అలాగే ముందుకు నడిపిస్తాడని ఫ్రాంచైజీ యాజమాన్యం భావిస్తోంది. వచ్చే ఐపీఎల్ నుంచే వెటోరీ ఈ ఫ్రాంచైజీతో చేరతాడని తెలుస్తోంది. గత మూడు ఐపీఎల్ సీజన్లలో సన్‌రైజర్స్ రెండు సార్లు చిట్ట చివరి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

ట్యాలెంట్ ఉన్న ఆటగాళ్లు ఉన్నా కూడా ఈ టీం అనుకున్న స్థాయిలో రాణించలేకపోతోంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో మరింత మంది కీలకమైన ఆటగాళ్లను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ చక్కగా రాణించింది. బలమైన జట్లకు షాకిచ్చేలా కనిపించింది. కానీ చిట్టచివరి మెట్టుపై బోల్తా పడి ఓటములు మూటు గట్టుకుంది.
ఈ నేపథ్యంలోనే వెటోరీని కోచ్‌గా నియమిస్తున్నట్లు సన్‌రైజర్స్ ప్రకటించింది. అంటే ఇప్పటి వరకు కోచ్‌గా ఉన్న బ్రయాన్ లారా ఈ పదవి నుంచి తప్పుకుంటాడని తేలిపోయింది. గతేడాది ఐపీఎల్‌కు ముందు సన్‌రైజర్స్‌తో కలిసిన లారా.. బ్యాటింగ్ కోచ్, స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా ఉన్నాడు.
ఆ తర్వాత టామ్ మూడీ ఈ ఫ్రాంచైజీని వీడటంతో లారాకు హెడ్‌కోచ్‌గా ప్రమోషన్ లభించింది. ఇప్పుడు వెటోరీకి ఈ రోల్ ఇచ్చినట్లు సన్‌రైజర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 'కివీ లెజెండ్ డానియల్ వెటోరీ ఆరెంజ్ ఆర్మీ హెడ్ కోచ్‌గా జాయిన్ అవుతున్నాడు. వెల్‌కమ్ కోచ్' అని సన్‌రైజర్స్ పోస్టు చేసింది.
అలాగే బ్రయాన్ లారాతో రెండేళ్ల ఒప్పందం ముగిసిందని, దీంతో ఆయనకు వీడ్కోలు పలుకుతున్నామని తెలిపింది. లారా భవిష్యత్తుకు ఆల్ ది బెస్ట్ చెప్తూ పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా టీం స్పిన్ బౌలింగ్ కోచ్‌గా వెటోరీ సేవలందిస్తున్న సంగతి తెలిసిందే.