
హైదరాబాద్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) మూడో సీజన్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా గురువారం క్వెటా గ్లాడియేటర్స్-లాహోర్ క్వాలండర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. పీఎస్ఎల్‌లో లాహోర్ క్వాలండర్స్ జట్టు తరుపున ఆడుతున్న సునీల్ నరేన్ బౌలింగ్ యాక్షన్ ఐసీసీ నిబంధనలకు విరుద్దంగా ఉందంటూ ఫిర్యాదు అందింది.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారులు ఈ మేరకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఈ టోర్నీ ప్లే ఆఫ్స్ నుంచి ఇప్పటికే లాహోర్ క్వాలండర్స్ తప్పుకుంది. లీగ్‌ల్లో తమ చివరి మ్యాచ్‌ని మార్చి 16 (శుక్రవారం) పెషావర్ జల్మీతో తలపడనుంది. అయితే వెస్టిండిస్ బోర్డు తీసుకునే నిర్ణయంపై నరేన్ భవితవ్యం ఆధారపడి ఉంది.
వెస్టిండిస్ తరుపున ఆరు టెస్టులు, 65 వన్డేలు, 48 టీ20లాడిన సునీల్ నరేన్ బౌలింగ్ యాక్షన్‌పై 2014 ఛాంపియన్స్ ట్రోఫీలో మొట్టమొదటిసారి ఐసీసీకి ఫిర్యాదు అందింది. దీంతో 2015 వరల్డ్ కప్‌కు ప్రకటించిన జట్టు నుంచి నరేన్‌ను తప్పించడంతో బౌలింగ్ యాక్షన్‌లో మార్పులు చోటు చేసుకున్నాడు.
ఆ తర్వాత మళ్లీ శ్రీలంకతో నవంబర్ 2016లో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లో నరేన్ బౌలింగ్ యాక్షన్‌పై అనుమానం రావడంతో నిషేధం ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత తన బౌలింగ్ శైలి మార్చుకోని తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతున్నాడు.
తాజాగా సునీల్ నరేన్ బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదు రావడంతో ఏప్రిల్ 7 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఎదురుదెబ్బనని క్రీడా పండితులు అంటున్నారు. ఐపీఎల్ 10వ సీజన్‌లో సునీల్ నరేన్ అటు బంతితో పాటు ఇటు బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు.